తెలంగాణ ఐపీఎస్ స్టీఫెన్ రవీంధ్ర ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు నిరాకరించడం అధికారవర్గాల్లో చర్చోపచర్చలకు కారణం అవుతోంది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం జగన్ తెలంగాణ సీఎంను కలిశారు. అప్పట్లో.. తెలంగాణ క్యాడర్లో ఉన్న స్టీఫెన్ రవీంద్రతో పాటు… జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలైన శ్రీలక్ష్మిని కూడా ఏపీకి డిప్యూటేషన్‌పై పంపాలని కోరారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. ఆ ఫైళ్లను.. కేంద్ర డీవోపీటీకి పంపారు. కానీ.. వారు వివిధ కారణాలతో.. స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌కు నిరాకరించారు. కానీ శ్రీలక్ష్మి విషయం మాత్రం పెండింగ్ పెట్టారు. అయితే ఏపీ సర్కార్ మాత్రం స్టీఫెన్ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి కేంద్రం కొద్ది రోజుల కిందట అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
కేంద్రం నుంచి అంగీకారం వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు నిరాకరించినట్లుగా చెబుతున్నారు. తాను తెలంగాణ క్యాడర్లోనే ఉంటానని ఆయన తేల్చి చెప్పడంతో.. ఏపీ సర్కార్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఆయనకు కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఇవ్వాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. మొదట్లో కొద్ది రోజుల పాటు అనధికారికంగా పని చేశారని కూడా చెప్పుకున్నారు. కానీ ప్రభుత్వం ఆయన కోసం.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత.. ఇప్పుడు ఆయనే వెనక్కి తగ్గడానికి కారణాలేమిటన్నదానిపై అధికారవర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందన్నది నిజం. కీలకమైన పోస్టుల్లో ఉండకపోవడమే మంచిదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. చట్ట విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుని కోర్టుల్లో చీవాట్లు తినడం.. ఇటీవలి కాలంలో ఉన్నతాధికారులకు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తున్న జీవోలు.. తీసుకుంటున్న చర్యలు.. ఇప్పుడు అధికారం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ.. పొరపాటున రేపు అధికారం మారితే.. వాటన్నింటికీ బాధ్యత వహించాల్సి వస్తుందని.. గతంలో జరిగిన పరిణామాల్ని చూసి భయపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిండా మునిగిన వారికి చలేమిటన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నా.. మిగిలిన వారు మాత్రం.. టెన్షన్‌కు గురవుతున్నారంటున్నారు. ఏపీకి రావడానికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కి తగ్గడమే ఇలాంటి పరిస్థితికి సాక్ష్యమంటున్నారు.