పూరి – రామ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తరవాత రామ్ ‘వారియర్’తో ఫ్లాప్ అందుకొన్నాడు. పూరి ‘లైగర్’తో ఫ్లాపులు అందుకొన్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. అందుకే ‘డబుల్ ఇస్మార్ట్’ తో మళ్లీ జట్టు కట్టారు. ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కాబట్టి మార్కెట్ పరంగా ఈ సినిమాకున్న క్రేజ్ … ఈ సినిమాకి ఉంది. కానీ ప్రమోషన్లతో, కంటెంట్ తో దాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆమధ్య విడుదలైన టీజర్ ‘ఓకే’ అనిపించుకొంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ఇప్పుడు ఓ పాట విడుదల చేశారు.
‘ఇస్మార్ట్ శంకర్’లో పాటలన్నీ హిట్టే. మణిశర్మ ఈతరానికి నచ్చేలా మాస్ బీట్లతో హోరెత్తించాడు. ఈ సీక్వెల్ కు కూడా ఆయనే సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘మాకి కిరికిరి’ అనే పాట విడుదల చేశారు. మాస్ పాటని మరింత నేల క్లాసుకి దిగిపోయి, రిలిక్స్ అందించడంలో దిట్ట… భాస్కరభట్ల. ఈ పాట కోసం ఆయన అదే చేశారు. ఓల్డ్ సిటీ నేపథ్యం ఉంది కాబట్టి, పాటలో అక్కడక్కడ హైదరాబాదీ ఉర్దూ పదాలు వరుస కట్టాయి. మంచి బీటున్న పాట ఇది. వినగానే స్టెప్పు వేయాలన్న ఉత్సాహం వస్తుంది. దానికి తగ్గట్టుగానే జానీ మాస్టర్ ఈ పాటకు రామ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా స్టెప్పులు డిజైన్ చేశారు. రామ్ కూడా కొన్ని లైన్లు పాడేశాడు. అక్కడక్కడ పూరి వాయిస్ కూడా వినిపిస్తుంది. ఈ మాస్ పాటలో `శాలీ బండ.. చంచల్ గూడ` అనే చరణంలో ఓ క్లాసికల్ వాయిస్ వినిపిస్తుంది. ఓరకంగా ఇదో ప్రయోగం అనుకోవొచ్చు. అనురాగ్ కులకర్ణి, సాహితి ఈ పాటను సంయుక్తంగా ఆలపించారు. ”గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అయితది” అంటూ మాస్ పంచ్‌తో ఈ పాటని ముగించారు.