భారత్ లో పెట్టుబడులు పెట్టేవారికి హైదరాబాద్ హాట్ ప్లేస్ గా కనిపిస్తోంది. ఇప్పటికే బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న పర్ల్ సిటీ, ఎన్నెన్నో ప్రతిష్టాత్మక సంస్థలకు వేదికైంది. గూగుల్ నుంచి యాపిల్ వరకూ బడా అమెరికా కంపెనీలన్నీ భాగ్యనగరికి క్యూకట్టాయి. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థ కూడా హైదరాబాదుకు రాబోతోంది. అదే, ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ సినీ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ స్థాపించిన డ్రీమ్ వర్క్స్.
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ సంస్థ సి.ఇ.ఒ.తో భేటీ అయ్యారు. చార్ సౌ షహర్ ప్రత్యేకతలను వివరించారు. టీఎస్ ఐపాస్ వగైరా పథకాల గురించి చెప్పారు. తామిచ్చే రాయితీల గురించీ చెప్పారు. దీంతో హైదరాబాద్ లో వెంచర్ మొదలుపెట్టడానికి ఆ సంస్థ ఓకే చెప్పింది.
యానిమేషన్, కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్, టీవీ సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలు, ఇంకా వినోద రంగంలో అనేక కార్యకలాపాలు జరిపే సంస్థ డ్రీమ్ వర్క్స్. స్పీల్ బర్గ్ తో పాటు జెఫ్రీ కజన్ బర్గ్, దేవిడ్ గెఫెన్ లు దీన్ని 1994లో ప్రారంభించారు. అయితే ఆ తర్వాతి సంవత్సరమే ఈ సంస్థ చేతులు మారింది. అమెరికాలోని ప్రసిద్ధ పారమౌంట్ పిక్చర్స్ మాతృ సంస్థ అయిన వయాకామ్ దీన్ని కొనుగోలుచేసింది. ఈ సంస్థ అనేక సినిమాలను కూడా నిర్మించింది. 1997లో ద పీస్ మేకర్ తో సినిమా నిర్మాణం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 30కి పైగా హాలీవుడ్ సినిమాలను నిర్మించింది.
టాలీవుడ్ లో ఇప్పుడంతా గ్రాఫిక్స్ మాయే.
కథ ఉన్నా లేకపోయినా గ్రాఫిక్స్ ఉంటే చాలనుకుంటున్నారు. అందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెడుతున్నారు. డ్రీమ్ వర్క్స్ హైదరాబాదుకు వస్తే ఈ విషయంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలకు మరింత నాణ్యమైన గ్రాఫిక్ వర్క్ అందుబాటులోకి వస్తుంది.
తద్వారా మార్కెట్ ను కూడా విస్తరించుకోవచ్చనే అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకూ విడుదల కాని దేశాల్లోకూడా తెలుగు సినిమాలను విడుదల చేయడానికి అద్భుతమైన గ్రాఫిక్స్ మంచి అస్త్రంగా ఉపయోగపడతాయి. ఇటీవల కొన్ని సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఈ పరిణామంతో అమెరికా వినోద పరిశ్రమ దృష్టి హైదరాబాద్ మీద పడుతుంది. దీంతో ముందు ముందు మరిన్ని కంపెనీలు చలో హైదరాబాద్ అన్నా ఆశ్చర్యం లేదు.