నేను చెప్పిందే నడవాలి… నా మాటే శాసనం… నేను ఉద్యమకారుడిగా, పార్టీ అధినేతగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా… తొమ్మిదిన్నరేండ్ల సీఎంగా ఉన్న. నా దగ్గరికే అందరు రావాలి తప్పా నేను ఎవ్వరి దగ్గరికి రాను అన్న ఆలోచనకు జనం ఇప్పటికే పనిష్మెంట్ ఇచ్చారు.
ప్రజల వద్దకే పాలన… ప్రజల వద్దకే పార్టీ అనేది సహజంగా రాజకీయ పార్టీల నినాదం ఉంటుంది. తాను కలవాలి అనుకున్న వారినే కేసీఆర్ కలుస్తాడు తప్పా ఎవరినీ కలవడని… ఆయనో దొర అంటూ గతంలో ప్రతిపక్షాలు విమర్శించాయి. జనం కూడా అవును అన్నట్లుగా ఓడించారు. ఒక్కసారి కాదు అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ ఓడించారు.
ఇక కేసీఆర్ మారకపోతే పార్టీ బతకదు అని అంతా అనుకుంటున్న దశలో… కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, పార్టీ ఆఫీసులో అందరికీ అందుబాటులో ఉంటారని అంతా భావిస్తున్న తరుణంలో కేసీఆర్ నిర్ణయాలు మళ్లీ వివాదాస్పదం అవుతున్నాయి.
కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్ ను కలుస్తున్నారు. కేసీఆర్ అందరికీ టైం ఇస్తున్నారని బీఆర్ఎస్ అనుకూల మీడియా చాటింపు వేస్తోంది. కానీ, ఎమ్మెల్యేల నుండి కార్యకర్తల వరకు అందరినీ కేసీఆర్ ఫాంహౌజ్ కే రప్పించుకుంటున్నారు. తాను చెప్పాలనుకున్నది చెప్పి పంపిస్తున్నారు. గతానికి ఇప్పటికి మారింది ఒక్కటే… సామాన్య కార్తకర్తలతో కూడా కేసీఆర్ ఫోటోలు దిగటం. అది కూడా నేతలు దగ్గరుండి ఫోటోలు దిగిపించాల్సిందే.
మా సారు ఇప్పటికైనా పార్టీ ఆఫీసుకు రాకుండా, సామన్య జనంతో మమేకం కాకుండా, అసెంబ్లీకి రాకుండా… అధికారంలోకి ఎలా వస్తారో అని సొంత పార్టీ క్యాడరే కామెంట్ చేస్తుందంటే కేసీఆర్ లో మార్పు ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.