ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదం మరోసారి తెరమీదికి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన చర్చ జరిగింది. అనంతరం, చర్చల వివరాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియాకి వెల్లడించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఎమ్.ఐ.ఎమ్. మినహా… పాల్గొన్న అన్ని పార్టీలూ జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయన్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీని ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తారని, నిర్ణీత కాల పరిమితికి లోబడి ఆ కమిటీ నివేదిక ఇస్తుందని రాజ్ నాథ్ చెప్పారు. ఆ కమిటీ నియామకం త్వరలోనే జరుగుతుందనీ, దాన్లో సభ్యులు ఎవరుంటారనేది ప్రధానమంత్రే స్వయంగా నిర్ణయిస్తారన్నారు.
అఖిల పక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు. కారణం… బెంగాల్ లో భాజపా వెర్సెస్ తృణమూల్ పొలిటికల్ వార్ అనేది తెలిసిందే! అయితే, జమిలి ఎన్నికలపై నిర్ణయం అనేది ఒక సమావేశం పెట్టేసి తీసుకోవాల్సిన నిర్ణయం కాదని ఆమె అంటున్నారు. సమాజంలో అన్ని వర్గాలో దీనిపై లోతైన చర్చ జరిగాకనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ముందుగా, ప్రజాభిప్రాయ సేకరణ తేలాక ఇలాంటి మీటింగులు పెట్టుకోవాలన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమౌతుంటే, ముందు దానిపై దృష్టి పెట్టకుండా ఎన్నికల సంస్కరణలు ఏంటంటూ ఆమె విమర్శిస్తున్నారు. తమిళనాడుకు చెందిన డీఎంకే కూడా జమిలి ఎన్నికల చర్చలకు దూరంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ ప్రతిపాదనకు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ తరఫున ఎంపీ గల్లా జయదేవ్ హాజరౌతారని అనుకున్నారు. కానీ, టీడీపీ వెళ్లలేదు!
జమిలి ఎన్నికలను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ, దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటనేది ముందుగా తేలాలి. ఎందుకంటే, రాష్ట్రపతి పాలన విధించడం ఒక నిర్దిష్ట కాలపరిమితికి లోబడే ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే… మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ రాష్ట్రంలో అధికారం మాటేంటి.? పరోక్షంగా కేంద్రమే ఆ రాష్ట్రంపై ఆధిపత్యం చెలాయిస్తుందా? ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వానికి మధ్యంతరం నిర్వహించాల్సిన వస్తే పరిస్థితేంటి..? అక్కడ రాష్ట్రపతి పాలన సాధ్యం కాదు కదా? ఇలాంటి చాలా మౌలికమైన అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.