సినిమా తీస్తున్నప్పుడు దర్శకులకు, నిర్మాతలకు, ఆ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులకూ సినిమా విషయంలో అపారమైన నమ్మకం ఉంటుంది. `మన సినిమా తప్పకుండా హిట్టవుతుంది` అనే అనుకొంటారు. అయినా సరే, ఎందుకైనా మంచిదని సన్నిహితులకు, సినీ ప్రముఖులకూ ముందస్తుగా సినిమాని చూపిస్తారు. వాళ్ల సలహాల్ని తీసుకొంటారు. కనీసం సినిమాని బయ్యర్లకైనా చూపించాల్సిందే. ఎందుకంటే కోట్లు పెట్టుబడి పెట్టేది వాళ్లేగా. సినిమా సకాలంలో విడుదల అవ్వాలంటే వాళ్లని ప్రసన్నం చేసుకోవాల్సిందే. అయితే ‘బాహుబలి 2’ విషయంలో ఇలాంటి సంప్రదాయాల్ని పక్కన పెట్టేశాడు రాజమౌళి.
ఈ సినిమాని ఇప్పటి వరకూ బయటివాళ్లెవ్వరికీ చూపించలేదు. అంతెందుకు… బయ్యర్లు ఒక్క సీన్ కూడా చూడకుండానే అడ్వాన్సులు ఇచ్చేశారు. ‘మాకు సినిమా చూపించండి’ అని అడిగే ధైర్యమూ ఎవ్వరూ చేయడం లేదు. విశేషమేంటంటే… ఈసినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటుల్లో చాలా మంది.. బాహుబలి 2 సినిమాని పూర్తిగా చూడలేదు. ఎవరి పని ఎంత వరకో.. అంత వరకే ఈ సినిమా చూశారు. రాజమౌళి, కెమెరామెన్ సింథిల్, కీరవాణి తప్ప… బాహుబలి 2ని పూర్తి స్థాయిలో ఎవ్వరూ చూడలేదంటే నమ్మశక్యమైన విషయం కాదు కదా? ఈ సినిమాని అంత రహస్యంగా దాచడం వెనుక ఒకే ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే… ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే సీక్రెట్ ఎవ్వరి ద్వారానూ లీక్ అవ్వకూడదని. అందుకే రాజమౌళి ఈ సినిమాని ఎవ్వరికీ చూపించడం లేదని తేలింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా బాహుబలి 2ని పూర్తి స్థాయిలో చూడాలంటే ఏప్రిల్ 27 వరకూ ఆగాలి. ఎందుకంటే ఆ రోజే బాహుబలి 2 ప్రీమియర్ ముంబైలో పడబోతోంది.