ఎన్నికల పోలింగ్ చివరి విడత ముగిసిన వెంటనే.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అందులో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తుందని తేలింది. ఆ తర్వాత రోజు స్టాక్ మార్కెట్లలో.. ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ మామూలుగా లేదు. రూ. ఐదు లక్షల కోట్లు.. ఒక్క రోజులోనే మదుపరుల సంపద పెరిగిపోయిందని… గొప్పలు చెప్పుకున్నారు. “నమో ఎగైన్” ఖాయమని పెట్టుబడిదారులు ఉరకలెత్తారని ప్రచారం చేశారు. ఆ తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు కూడా.. స్టాక్ మార్కెట్లు అంత గొప్పగా స్పందించలేదు. కానీ… బడ్జెట్ పెట్టిన తర్వాత మాత్రం మళ్లీ అదే స్థాయిలో స్పందిస్తున్నాయి. కాకపోతే రివర్స్‌లో.. అప్పుడు లక్షల కోట్లలో పెట్టుబడిదారుల సంపద పెరిగితే.. ఇప్పుడు… అంత కంటే ఎక్కువ స్థాయిలోనే… పెట్టుబడిదారుల సంపద కరిగిపోతోంది.
బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో… స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. శక్ర, సోమవరాల్లో ట్రేడింగ్ సెషన్లలో కనీసం రూ. 8 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో… సంపన్నులపై సర్ ఛార్జీల విధింపు, విదేశీ పెట్టుబడిదారులపై అత్యధిక టాక్స్ సర్ ఛార్జ్ విధింపు, కంపెనీల్లో ప్రమోటర్ల వాటా తగ్గిస్తూ ప్రజల వాటా పెంచడం వంటి ప్రతిపాదనలు… ఇన్వెస్టర్లకు మింగుడుపడలేదు. అందరూ షేర్ల అమ్మకాలకే మొగ్గుచూపారు. ఈక్విటీల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. బంగారంపై పన్ను వడ్డించడంతో.. రేటు పెరగడం ఖాయం కనుక ఆ షేర్లు మాత్రం లాభ పడుతున్నాయి.
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులనేది.. ఎవరూ ఊహించలేని విషయం. పెట్టుబడిదారులు.. ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం. చిన్న విషయానికే మార్కెట్ క్రాష్ అయిపోతూ ఉంటాయి. అంతే చిన్న విషయానికి… సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు చూపిస్తాయి. ఇలాంటి విషయాలను కూడా.. తమ ప్రాబల్యమేనని.. అభివృద్ధికి గుర్తని.. కొంత మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. నిజంగా ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ వల్ల.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కరిగిపోతోంది. ఇది మాత్రం.. కచ్చితంగా… ప్రభుత్వ విధానం వల్లేనని… మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.