బడ్జెట్లో పన్ను వడ్డింపులు ఏమీ లేకపోవడం … ఎన్నికల బడ్జెట్‌గా ఆకర్షణీయంగా కనిపించడంతో స్టాక్ మార్కెట్లో జోష్ కనిపించింది. అయితే అదానీ షేర్లకు మాత్రం కాదు. అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. హిండెన్ బెర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చిన తర్వాత అదానీ ఎంటర్ ప్రైజేస్ షేర్లు దారుణంగాపడిపోకుండా కాస్త కాపాడుకున్నారు. ఎఫ్ పీ వో అయిపోగానే ఈ రోజు ఆ కంపెనీ షేర్లను కూడా కాపాడుకోలేపోయారు. పాతిక శాతం షేర్ పడిపోయింది. ఎఫ్ పీ వోలో ఒక్కో షేర్ ను రూ. మూడు వేలకుపైగా అంటగడితే.. ఇవాళ ఆ షేర్ ధర రూ. రెండు వేల వద్దకు వచ్చింది.
ఇక హిండెన్ బెర్క్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి పతనమవుతూనే ఉన్నా.. ఇతర గ్రూప్ కంపెనీల షేర్లు కూడా పతనమవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా వాటి పతనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. దీనికి కారణం అదానీ కంపెనీల షేర్లకు అప్పులివ్వకూడదని క్రెడిట్ సూయిస్ సంస్థ సిఫార్సు చేసింది. అదానీ కంపెనీల షేర్లను మార్జినల్ లోన్స్ కు తనఖాకు అంగీకరించకూడదని నిర్ణయించింది. దీంతో ఒక్క సారిగా ఆ షేర్ విలువ పడిపోవడం ప్రారంభించింది. షేర్స్ ఉన్న వారంతా ఎంత వస్తే అంత అని అమ్ముకోవడం ప్రారంభించారు. ఫలితంగా షేర్ ధర ఊహించనంతగా పడిపోయింది.
అదానీ కంపెనీలకు రోజులు కలిసి రావడం లేదు. ఇతర సంస్థలు కూడా అదానీ షేర్లకు జీరో విలువ నిర్ణయిస్తే.. ఇక ఎవరూ తాకట్టు కూడా పెట్టుకోరు. ఇది మరింత తేడా కలిగిస్తుంది. ఇప్పటికే తమపై వచ్చిన ఆరోపణల్ని కప్పి పుచ్చుకోవడానికి జాతీయతను కూడా వాడేసిన అదానీకి.. ప్రభుత్వం.. విచారణల నుంచి రక్షణ లభిస్తుందేమో కానీ.. తాను నిర్మించిన గాలి మేడల్నికాపాడుకోవడానికి మాత్రం చాలా తంటాలు పడాల్సిందే.
వారం రోజుల కిందట.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండే అదానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పడం కష్టం. ఆయన ఇంకా ఎంత దిగజారిపోతారో కూడా అంచనా వేయడం కష్టమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.