స్టాక్ మార్కెట్ అంటే ఒకప్పుడు ఎగువ మధ్యతరగతి వాళ్లు మాత్రమే ఆలోచించే పెట్టుబడి సాధనం. అది పెట్టుబడి సాధనం అని అనుకుంటారు కానీ.. ఓ రకంగా జూదం లాంటిదే. కానీ చట్టబద్ధమైన జూదం. ఎంత తెలివిగా ఆడితే అంత లాభం ఉంటుంది. ఒక్కో సారి స్టాక్ మార్కెట్ ఆటగాళ్లు చేసే మాయాజాలానికి పెట్టుబడిదారులంతా ఎంత తెలివైనవారు అయినా సరే సర్వం పోగొట్టుకోవాల్సిందే. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది.
స్మార్ట్ అయ్యాక ప్రతి ఒక్కరికీ డీ మ్యాట్ అకౌంట్
స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత బ్యాంకులు డీ మ్యాట్ అకౌంట్లను చాలా మినిమం ఖర్చుతో లేకపోతే ఉచితంగా ఇవ్వడం ప్రారంభించాయి. బ్యాంకింగ్ యాప్ లో ఒక్క క్లిక్ తో డీ మ్యాట్ అకౌంట్ ప్రారంభించేసి.. షేర్లు ట్రేడింగ్ చేయడం ప్రారంభించేయవచ్చన్నట్లుగా సరళతరం చేశారు. దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ ఫోర్ట్ ఫోలియో ఏంటి అని ఆరా తీసేంత షేర్ మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. నిజానికి ఈ పరిజ్ఞానం ఈ రోజు ఎంత పెరిగింది.. ఎంత పోయింది అనే వరకే పరిమితం.
స్టాక్ మార్కెట్లోకి లక్షల కోట్ల మధ్యతరగతి ప్రజల సొమ్ము
ఇటీవలి కాలంలో డీమ్యాట్ అకౌంట్ల విప్లవం రావడంతో.. ఏదైనా ఓ మంచి సంస్థ ఐపీవోకు వస్తుందంటే.. వందల రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అవుతోంది. దీనికి కారణం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇలాంటి మధ్యతరగతి పెట్టుబడిదారులే. వీరంతా దీర్ఘకాలంగా ఓపికతో ఉండేవారు కాదు. ఇవాళ ఉదయం కొన్న షేర్లు సాయంత్రానికి లాభం వస్తే అమ్మేసుకునే తరహాలో ట్రేడింగ్ చేసేవారు. ఇలాంటి ట్రేడింగ్ వల్ల నష్టమే జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. ట్రంప్ నిర్ణయాల కారణంగా పడిపోయిన స్టాక్ మార్కెట్లో నష్టపోయిన లక్షల కోట్లలో మధ్యతరగతి ప్రజల సొమ్మే ఎక్కువగా ఉంటుంది.
దీర్ఘ కాలం.. పూర్తి అవగాహనతోనే పెట్టుబడి పెట్టాలి !
స్టాక్ మార్కెట్ అంటే ఎంత అర్థం చేసుకున్నా.. నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. అది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. అందరి రూపాయికి ఒకే విలువ ఉండదు. పది వేలు జీతం తీసుకునేవాడి రూపాయికి.. లక్షల జీతం తీసుకునేవాడి రూపాయికి విలువ మారుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో ఎవరి రూపాయికి అయినా ఒకటే విలువ. అప్పనంగా డబ్బులు వస్తాయని ఎవరైనా ఆశపడితే నిండా మునిగిపోవడం తప్ప లాభపడేదేమీ ఉండదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరిణామాలు అవే నిరూపిస్తున్నాయి.