అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెటమతం నిర్ణయాల కారణంగా భారత్ కూడా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే బారీగా పడిపోయాయి. తొలి గంటలోనే సెన్సెక్స్ ఏకంగా నాలుగు శాతం పడిపోయింది. నిఫ్టీ కూడా రికార్డు స్థాయిలో వెయ్యి పాయింట్లు నష్టపోయింది. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరి సంపద కరిగిపోయింది. రోజంతా ఎంత ఘోరంగా ఉంటుందో.. తర్వాత ఎలా ఉంటుందోనని మార్కెట్లో ఆందోళన కనిపిస్తోంది.
ఈ పరిస్థితి ఒక్క భారత స్టాక్ మార్కెట్ కు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. ప్లస్ లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. చైనా, హాంకాంగ్, సింగపూర్, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా సోమవారం స్టాక్ మార్కెట్లు ఓపెన్ అయిన ప్రతీ దేశం నష్టపోతోంది. అత్యధికంగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్ 9 శాతం వరకూ నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఓపెన్ అవుతాయి. నాస్ డాక్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ ఉండదని అక్కడ బ్లడ్ బాత్ తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతరం చేస్తున్న ఒకే ఒక్క పేరు ట్రంప్. ఆయన నిర్ణయాలు.. అర్థం, పర్థం లేని టారిఫ్ ల కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. పోనీ ఆయన నిర్ణయాలు వల్ల అమెరికన్లు అయినా లాభపడుతున్నారా అంటే.. వారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ వైరస్ కు స్టాక్ మార్కెట్లు వ్యాక్సిన్ కనుగొంటాయో లేదో అంచనా వేయడం కష్టంగా మారుతోంది.