ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది. గుంటూర్ జిల్లా తెనాలిలో వారాహి యాత్ర కొనసాగుతుండగా పవన్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అది పవన్ కళ్యాణ్ కు తగలకుండా కొద్ది దూరంలో పడిపోవడంతో పవన్ ప్రమాదం నుంచి సేఫ్ అయ్యారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది రాయి విసిరిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు.
జగన్ పై రాయి దాడి ఘటన మరవకముందే పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరగడం చర్చనీయాంశం అవుతోంది. జగన్ పై దాడి పక్కా ప్రతిపక్షాల ప్లానేనని ఆరోపణలు చేస్తోంది వైసీపీ. దీంతో ప్రతీకారంగా వైసీపీ మూకలే పవన్ పైకి దాడికి ఉసిగొల్పాయా.? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి జనసేన శ్రేణులు.
జగన్ పై దాడి జరిగిన వెంటనే చంద్రబాబు, పవన్ తో సహా ప్రతిపక్ష నేతలంతా ఖండించారు. ఇలాంటి దాడులు సరికాదని ప్రకటించారు. అయినప్పటికీ ఆదివారం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు.. చంద్రబాబు, పవన్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
జగన్ పై దాడిని ప్రతిపక్షాల కుట్రేనని ఓ కథ గతంలో కోడికత్తి తరహాలో అల్లేశారు. కట్ చేస్తే.. సాయంత్రానికి పవన్ పై ఓ వ్యక్తి దాడికి యత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ పై దాడి ప్రతిపక్షాల కుట్రే అయితే…పవన్ పై దాడి వైసీపీ నేతల కుట్రేనా అంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.