ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయి. దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో ఉన్న వాటా 51 శాతం మొత్తం ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వానికే వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతర పెట్టడానికి కూడా అవకాశం దక్కలేదు. అయితే ఇప్పుడు సింగరేణికి అధిక వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ విషయంలో మాత్రం… విభజన చట్టంలోని నిబంధనలు తప్పుగా కనిపిస్తున్నాయి. ఆప్మెల్గా పిలిచే ఈ సంస్థలో సింగరేణి సంస్థకు 81 శాతానికిపైగా వాటా ఉంది. ఉమ్మడి సంస్థల పంపిణీకి నియమించిన షిలా బిడే కమిటీ ఆప్మెల్ సంస్థ .. ఆంధ్రప్రదేశ్ కే చెందుతుందని తీర్మానించింది. దీనికి ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
చట్టంలో ఉన్న దాని ప్రకారం ఆప్మెల్ తమకే కావాలని ఆంధ్రప్రదేశ్ కమిటీ ముందు సుదీర్ఘంగా వాదనలు వినిపించింది. చివరికి కమిటీ ఆప్మెల్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలని ప్రతిపాదించింది. ఇప్పుడు ఆప్మెల్ ఏపీ చేతుల్లో రావడమే మిగిలి ఉంది. ఆప్మెల్ కు విజయవాడలోనే కాకుండా, విజయవాడ సమీపంలోని కొండపల్లిలో విలువైన ఆస్తులున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల విస్తరణకు అవి ఉపయోగపడునున్నాయి. కానీ అంత తేలిగ్గా వచ్చేస్తే.. విభజన చట్టాన్ని అంత కష్టపడి పాస్ చేసి ఉండేవాళ్లు కాదేమో.
ఆప్మెల్ను స్వాధీనాన్ని తప్పు పడుతూ కేంద్రానికి తెలంగాణ వెంటనే లేఖ రాసింది. విభజన చట్టాన్ని తప్పుగా అన్వయించి, నిపుణుల కమిటీ నివేదికను సాకుగా చూపి అత్యంత విలువైన ఆస్తులున్న ఆప్మెల్ ను తమ వశం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తున్నదని తెలంగాణ ఆరోపణ. ఆప్మెల్ ను ఏపీకి ఇచ్చిస్తే.. సింగరేణిలో 51 శాతం వాటాలున్న తెలంగాణకు, 49 శాతం వాటాలున్న కేంద్రానికి నష్టమని కేంద్రానికీ ఫిర్యాదులో తెలంగాణ ఆశలు చూపించింది. షెడ్యూల్ 9లో ఉన్న సంస్థల విషయంలో వివాదాలు, సందేహాలు ఉత్పన్నమైతే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని విభజన బిల్లు లో పేర్కొన్నారని, దీని ప్రకారం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆసలే ఏపీపై కసితో ఉన్న కేంద్రం ఈ నిర్ణయాన్ని ఇప్పుడు తెలంగాణ విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ప్రారంభమైంది.