తిరుపతి ఎంపీ సీటు ఖాళీ అయిన కారణంగా త్వరలోనే ఆ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి జనసేన పార్టీలకు గత ఎన్నికలలో ఇక్కడ ఏ మాత్రం ఓట్లు రాకపోయినప్పటికీ, మారిన పరిణామాల నేపథ్యంలో బీజేపీ జనసేన కూటమికి ఇక్కడ అవకాశాలు బాగానే మెరుగైన ట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన ల మధ్య విభేదాలు పొడసూపాయి అంటూ ఛానల్స్ గత రెండు రోజులుగా వరుస కథనాలను ప్రసారం చేయడం, కొంత వరకు బీజేపీ జనసేన అభిమానులు కూడా ఆ చానల్స్ ట్రాప్ లో పడిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే.
చానల్స్ వరుస కథనాలు:
దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికలలో అనూహ్యంగా తెలంగాణలో బిజెపి దూసుకురావడంతో, ఇదే తరహా దూకుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది అంటూ కొందరు విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉద్దండులైన కెసిఆర్ కే చుక్కలు చూపించిన బిజెపికి పలు ఆర్థిక నేరాల ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎదురు చెప్పే పరిస్థితిలో లేని జగన్ ని దెబ్బ కొట్టడం పెద్ద విషయం కాదని వారు వ్యాఖ్యానించారు. దాంతోపాటు జనసేన కారణంగా తిరుపతి లో కుల సమీకరణాలు కూడా కలిసి వస్తుండడంతో అనూహ్యంగా బిజెపి జనసేన కూటమి రేసులోకి దూసుకొచ్చింది. అయితే ఇంతలోనే పలు ఛానల్స్ లో బిజెపి జనసేన ల మధ్య విభేదాలు అని కథనాలు వస్తున్నాయి. బిజెపి జనసేన మధ్య మిత్ర భేదం అంటూ ఒక ఛానల్ హెడ్డింగ్ పెడితే, జనసేన కు బీజేపీ హ్యాండిచ్చింది అంటూ ఒకరు, బిజెపికి జనసేన కౌంటర్ ఇచ్చింది అని మరొకరు, కత్తులు దూసుకుంటున్న బిజెపి జనసేన అని ఇంకొకరు కథనాలు ప్రసారం చేశారు. ఆ రెండు పార్టీలకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జనసేన కానీ బీజేపీ కానీ నిర్వహించిన బహిరంగ సమావేశాలను సైతం ప్రసారం చేయని ఈ చానల్స్ కు హఠాత్తుగా బిజెపి జనసేన కూటమి మీద ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అన్నది రాజకీయ విశ్లేషకులు అర్థమవుతూనే ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీల అభిమానుల్లో మాత్రం కొందరు చానల్స్ కథనాలకు ట్రాప్ అయినట్టుగా అర్థమవుతుంది.
ట్రాప్ అయిన పార్టీల అభిమానులు :
అక్కడ ఉన్నది ఒకే ఒక్క సీటు. కాబట్టి ఈ రెండు పార్టీలలో ఎవరో ఒకరే చివరికి పోటీ చేస్తారు మరొక పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తుంది. అయితే చానల్స్ ప్రసారం చేస్తున్న కథనాల కారణంగా సోషల్ మీడియాలో కొందరు అభిమానులు కూడా పవన్ లేకుండా బిజెపి గెలవదు అని, బిజెపి లేకుండా జనసేన గెలవదు అని వాగ్వాదాలు చేసుకుంటున్నారు. కొందరు జనసేన అభిమానులు అయితే ప్రతిసారీ బీజేపీకి మద్దతు ఇచ్చే దానికి బీజేపీతో పొత్తు ఎందుకు అని నిష్ఠూరాలు కూడా పోతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికి జనసేన ఎన్జీవో కాదు అని ఇది రాజకీయ పార్టీ అని వారు అంటున్నారు. ఇటు బిజెపి కూడా రెండు పార్టీలు సమన్వయంతో పని చేసుకోవాలి అని కేంద్రం ఎవరిని ఆదేశిస్తే వారు పోటీ చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య తిరుపతి ఎన్నిక ఎంతో కొంత గ్యాప్ తీసుకువచ్చిన మాట వాస్తవమే.
మిత్రభేదం ఎవరికి లాభం?
అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలను కానీ బిజెపి కార్యక్రమాలను కానీ కవరేజ్ చేయకుండా తాము అభిమానించే పార్టీలకు పొద్దస్తమానం డప్పు కొట్టే ఈ చానల్స్ కు హఠాత్తుగా జనసేన బీజేపీ పార్టీల మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అన్నది పెద్ద పజిల్ ఏమీ కాదు. బిజెపితో కయ్యం పెట్టుకుని చారిత్రాత్మక తప్పిదం చేశాము అన్న భావనలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బిజెపి ఒప్పుకుంటే ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే మంచి ఆఫర్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గతంలోలా పది ఇరవై సీట్లకు పరిమితం చేయకుండా, బిజెపికి కూడా ఎమ్మెల్యే సీట్లను టీడీపీతో దాదాపు సమానంగా ఎంపీ సీట్లను టిడిపి కంటే ఎక్కువగా ఇవ్వడానికి సైతం చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లెక్కన బీజేపీ జనసేన ల మధ్య ఏర్పడే మిత్రభేదం కారణంగా ఎక్కువగా లాభపడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం టిడిపి మాత్రమే. బిజెపి టిడిపి కూటమి అయినా, బిజెపి జనసేన టిడిపి కూటమి అయినా రెండింటిలో ఏదైనా సరే అన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రాప్ లో పడకండి అంటూ జన సైనికులకు విశ్లేషకుల హితవు:
2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయడం, సామాజికవర్గాల పరంగా ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ దానికి తగిన స్థాయిలో క్యాడర్ను నిర్మించుకో లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల చతికిలపడిన జనసేన- బీజేపీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా మంచి వ్యూహమే. అయితే జిహెచ్ఎంసి తిరుపతి వంటి ఒకటి లేదా రెండు ఎన్నికలను సాకుగా చూపి ఇతర పార్టీల అడుగులకు మడుగులు ఒత్తే చానల్స్ చేస్తున్న మిత్రభేదం కార్యక్రమాలను చూసి ట్రాప్ లో పడకండి అంటూ జన సైనికులకు రాజకీయ విశ్లేషకులు తో పాటు ఆ పార్టీ నేతలు కూడా హితవు పలుకుతున్నారు. రాజకీయాల్లో ఓపిక అవసరం అని, జనసేన బిజెపిల మధ్య కేంద్ర స్థాయిలో చక్కటి అవగాహన ఉందని, చిన్న చిన్న విషయాల తో బిజెపి ని దూరం చేసుకుంటే రాజకీయ ప్రత్యామ్నాయం ఎదిగే అవకాశాన్ని జనసేన బిజెపి కోల్పోతాయని వారు అంటున్నారు
మొత్తానికి జనసేన బిజెపి ల మిత్రభేదం అంటూ ఆయా పార్టీల క్యాడర్లను గందరగోళానికి గురి చేయడం లో కొన్ని న్యూస్ ఛానల్స్ కొంతవరకు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే ఆ ట్రాప్ ని జన సైనికులు కూడా కొంతవరకు అర్థం చేసుకున్నట్లు గా కనిపిస్తోంది.