”అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా?”
– అక్షరాల్లో పెను విస్పోటనం కూడా ఉంటుందని చాటి చెప్పిన పాట ఇది.
‘సింధూరం’ అనగానే ఆ సినిమాలో నటించిన బ్రహ్మాజీనో, రవితేజనో, తీసిన కృష్ణవంశీనో కాదు. ముందుగా గుర్తొచ్చేది. ఈ పాట. ఆ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఓ ఉద్వేగం కలుగుతుంది. ఆలోచన రేకెత్తుతోంది. మనమూ ఏదో చేసేయాలన్న కసి పెరుగుతుంది. త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే ”రెండు చేతులూ చేబులో పెట్టుకొని ఎటో వెళ్లిపోవాల”ని అనిపిస్తుంది. ఆ శక్తి…. ఈ పాటకుంది. ‘సింధూరం’ సినిమా అంతా ఒక ఎత్తు. ఈ పాట మరో ఎత్తు. 49 ఓవర్లు ఎలా ఆడినా, 50 వ ఓవర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి మ్యాచ్‌ని గెలిపిస్తే ఎంత కిక్ ఉంటుందో… అంత కిక్ ఈ పాట ఇచ్చింది.
అయితే ఈ పాట పుట్టుక చాలా వింతగా కొత్తగా జరిగింది.
‘సింధూరం’ సినిమా పూర్తయ్యింది. మరో రెండు రోజుల్లో రిలీజ్. ఈలోగా ప్రివ్యూ వేశారు. సినిమా అంతా చూసిన సీతారామశాస్త్రి, బయటకు వచ్చి అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు.
‘ఏమైంది గురువు గారూ… సినిమా నచ్చలేదా’ అంటూ బెంగగా అడిగాడు కృష్ణవంశీ.
‘ఏదైనా పేపర్ ఉందా’ అని అడిగి అటూ ఇటూ మళ్లీ ఆలోచిస్తూ కలితిరుగుతున్నారు సిరివెన్నెల.
చేతిలో పేపర్ లేదు. అటూ ఇటూ వెదికితే ఓ ఖాళీ సిగరెట్ పెట్టె దొరికింది. దాన్ని అడ్డంగా చింపి.. సీతారామశాస్త్రికి అందిస్తే, పదే పది నిమిషాల్లో ఓ పాట రాసి కృష్ణవంశీ చేతుల్లో పెట్టారు.
‘నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో తెలీదు. ఈ పాట ఈ సినిమాలో ఉండాలి’ అని చెప్పి, ఎక్కడెక్కడ ఆ పాట ఉండాలో దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, ఇప్పుడు పాటంటే ఎలా? అని కంగారు పడ్డారు కృష్ణవంశీ. కానీ అది గురువు గారి సలహా కాదు. ఆజ్ఞ. దాన్ని శిరసా వహించాల్సిందే. అందుకే ఆఘమేఘాల మీద ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మీద వాలిపోయారు. ఎలాగైనా సరే, పాడేయండి సార్ అంటూ ప్రాధేయ పడ్డారు. ఆయన పాట చూసి పులకించిపోయి, గళం అందుకొన్నారు.
అలా… ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని’ పాట పుట్టింది. అప్పటికప్పుడు ఆ పాట సినిమాలో యాడ్ చేసేశారు. ఆ తరవాత ఆ పాటకు తెలుగు సినిమా అభిమానులు ఇచ్చిన స్థానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీతారామశాస్త్రి రాసిన గొప్ప పాటల్లో అదొకటి. ఇప్పటికీ ఈ పాట గురించి సాహిత్యాభిమానులు చర్చించుకొంటూనే ఉంటారు. సిరివెన్నెలను గుర్తు చేసుకొంటూనే ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధం నెమరివేసుకొంటూ – ఈ సంఘటనని తలచుకొన్నారు కృష్ణవంశీ.