సల్మాన్ ఖాన్ కెరీర్లో మర్చిపోలేని సినిమా ‘భజరంగీ భాయ్‌జాన్’. విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపుదిద్దుకొంటోంది. సీక్వెల్ అనేకంటే ప్రీక్వెల్ అనడం బెటరేమో..? ఎందుకంటే 8 ఏళ్లకు ముందు జరిగిన సంఘటనలతో ఈ కథని రూపొందించనున్నారు. భజరంగీలో ఓ చిన్నపాప పై ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. ఈసారి లవ్ స్టోరీ చూపించబోతున్నారని సమాచారం. అంతేకాదు.. ఈకథలో మరో హీరోకీ ఛాన్సుంది. ఆ పాత్ర కోసం దక్షిణాది నటుడ్ని ఎంచుకోవాలన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం.
నిజానికి విజయేంద్ర ప్రసాద్ ఈ కథని రాజమౌళికే ఇవ్వాలనుకొన్నారు. ఓరోజు కథని వినిపించారు కూడా. అయితే ఆ సమయంలో బాహుబలి క్లైమాక్స్ చిత్రీకరణలో ఉండి.. ఆ టెన్షన్లో ఈ కథపై సరిగా దృష్టి పెట్టలేకపోయారట రాజమౌళి. అందుకే ”నేను ఈ సినిమాని డైరెక్ట్ చేయలేను.. మరో దర్శకుడికి ఇచ్చుకోండి” అనేశార్ట. ‘భజరంగీ..’ విడుదలైన తరవాత మంత మంచి కథ మిస్ అయ్యాడో రాజమౌళికి తెలిసొచ్చింది. ”బాహుబలి క్లైమాక్స్ టెన్షన్లో ఉండి మీ కథని సరిగా అర్థం చేసుకోలేకపోయాను. పది రోజుల ముందో, తరవాతో చెప్పి ఉంటే ఈ కథని నేను చేసి ఉండేవాడ్ని” అన్నార్ట తండ్రితో. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించారు. 2025లో ‘భజరంగీ 2’ సెట్స్ పైకి వెళ్లబోతోంది.