చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ సస్పెండ్ జడ్జి రామకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు ఏదో పెట్టీకేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న వస్తువుల్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నుంచి ఆయన ఫోన్ మిస్ అయిందని కోర్టులో అఫిడవిట్ వేశారు. ఇప్పుడు ఆ ఫోన్లో న్యాయవ్యవస్థపై జరుగుతున్న కుట్రకు సంబంధించిన ఆధారాలున్నాయని.. ఆ ఫోన్ను పోలీసులు మంత్రి పెద్దిరెడ్డికి ఇస్తే… దాన్ని సజ్జలకు ఇచ్చారని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. దీంతో ఆ కేసు ఇప్పుడు కీలకంగా మారింది. కొన్నాళ్ల క్రితం… హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైరైన జస్టిస్ ఈశ్వరయ్య అనే పెద్దాయన రామకృష్ణకు ఫోన్ చేసి అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి… సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణలపై ఆరోపణలు చేయాలని ప్రోత్సహించారు.
ఆయన అలా కుట్ర చేస్తున్నారని జడ్జి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈశ్వరయ్య ఫోన్ కాల్ కుట్ర తేల్చాలని హైకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ వద్దని… జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అనూహ్యంగా.. ఫోన్లో ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్న సమయంలో… పోలీసులు ఆయనపై పెట్టీ కేసు పెట్టి స్వాధీనం చేసుకుని ఇప్పుడా ఫోన్ పోయిందని చెబుతున్నారు. దీంతో న్యాయవ్యవస్థపై చేసిన కుట్రకు సంబంధించిన సాక్ష్యాలు మాయం చేయడానికే ఇలా చేశారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడిన మాటలు వీడియోలో వచ్చాయి. తాను మాట్లాడానని చెబుతున్నారు.
అయితే ఆయన చాలా వరకూ తన కు మద్దతుగా ఉన్న మాటల్నే మాట్లాడినట్లుగా చెబుతున్నారు. మొత్తం ఆడియో… టేప్ ఇప్పుడు కీలకంగా మారింది. అది ఫోన్ రికార్డింగ్. ఇప్పుడు ఆ ఫోన్నే పోలీసులు అధికారికంగా మాయం చేశారు. దీంతో కీలకమైన సాక్ష్యం మాయం అయినట్లయిందని అంటున్నారు. ఇప్పుడు రామకృష్ణ ఇదే విషయాన్ని రచ్చ రచ్చ చేస్తున్నారు. పోలీసుల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. నిజానికి జడ్జి రామకృష్ణ చిత్తూరుజిల్లా పోలీసుల నుంచి ఎదుర్కొన్న వేధింపులు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఆయనను ఇంట్లో నుంచి బయటకు రావొద్దన్న ఆదేశాలు కూడా ఓ సందర్భంలో ఇచ్చారు. ఆయనపై పదే పదే కేసులు నమోదయ్యాయి. కుటుంబసభ్యులపై దాడులు జరిగాయి. అయితే ఆయన పోరాటాన్ని ఎప్పుడూ ఆపలేదు.