గత కొన్ని రోజుల నుంచీ ‘మన్నాడు’ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. శింభు నటించిన తమిళ సినిమా ఇది. ఈసినిమాని గీతా ఆర్ట్స్ తెలుగులో రీమేక్ చేస్తుందని వార్తలొచ్చాయి. ఆ తరవాత.. సురేష్ ప్రొడక్షన్స్ ‘మన్నాడు రైట్స్ మా దగ్గర ఉన్నాయి’ అంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది. దాంతో.. అసలు మన్నాడు గీతా ఆర్ట్స్నుంచి.. సురేష్ప్రొడక్షన్స్కి ఎలా వెళ్లిందన్న అనుమనాలు వ్యక్తం అయ్యాయి. ‘మన్నాడు’ రీమేక్ విషయంలో.. తెర వెనుక జరిగిన స్టోరీ.. ఇది.
‘మన్నాడు’ని తెలుగులో ‘లూప్’ పేరుతో డబ్ చేశారు. తెలుగులో విడుదల చేయడానికి గీతా ఆర్ట్స్ ని సంప్రదించారు నిర్మాతలు. అందుకు గీతా ఆర్ట్స్ కూడా ఒప్పుకుంది. కమీషన్ బేసెస్మీద ఈ సినిమాని గీతా ఆర్ట్స్ విడుదల చేయడానికి రెడీ అయ్యింది. అయితే… తమిళ నాట సెన్సార్ సమస్యల వల్ల ‘మన్నాడు’ ఒక రోజు ఆలస్యంగా విడుదలైంది. దాంతో ‘లూప్’ విడుదల వాయిదా వేశారు. ‘మన్నాడు’ తమిళంలో సూపర్ హిట్టయిపోవడంతో.. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ తమిళ నిర్మాతల్ని సంప్రదించి.. రీమేక్ రైట్స్ కోసం ఆరా తీశారు. మిగిలిన భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఒప్పుకున్న శింబు.. తెలుగులో మాత్రం రీమేక్ చేయొద్దని, డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయమని షరతు పెట్టాడు. ఎందుకంటే… ఈ సినిమా తమిళంలో బాగా ఆడింది. తెలుగులో విడుదల చేసినా మంచి విజయాన్ని అందుకుంటుదన్నది శింబు నమ్మకం. తెలుగులో ఈ సినిమా ఆడితే, తనకు మార్కెట్ ఓపెన్ అవుతుందని ఆశ పడ్డాడు. అందుకే తెలుగు రీమేక్ రైట్స్ మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సురేష్ ప్రొడక్షన్స్ చేతుల్లో కూడా ఇప్పుడు తెలుగు రీమేక్ రైట్స్ లేవు. వాళ్ల దగ్గర కేవలం డబ్బింగ్ రైట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక వేళ రీమేక్ చేయాలనుకుంటే.. ఒక్క తెలుగుకి మాత్రం రూ.5 కోట్లు చెల్లించాలని శింబు షరతు విధించాడట. దాంతో సురేష్ ప్రొడక్షన్స్ కూడా లైట్ తీసుకుంది. అంటే.. మన్నాడు తెలుగుల రీమేక్ అయ్యే ఛాన్స్ లేదు. వస్తే గిస్తే డబ్బింగ్ వెర్షన్ రావాలి. చిత్రం ఏమిటంటే.. కొన్ని పైరసీ సైట్లలో ఆల్రెడీ `లూప్` తెలుగు వెర్షన్ ఉంది.