మాట ఆగిన చోట… పాట పుడుతుంది. వందలాది భావాల్నీ, ఒక్కోసారి వాటిల్లో కూడా పేర్చలేని అనుభూతుల్ని ఒకే ఒక్క పాట ఆవిష్కరిస్తుంది. సినిమా పాటల్లో మరో ప్రత్యేక లక్షణం ఉంది. స్వరం, గాత్రం, భావంతో పాటు నాట్యం, అభినయం, వినోదం, పాత్రల తాలుకూ ఔచిత్యం… ఇవన్నీ పాటకు తోడవుతాయి. గీతమెప్పుడూ దృశ్య రూపంలో మరింత వికసిస్తుంది. సినిమా పాట కనీస బాధ్యత.. కథ చెబుతూనే, ప్రేక్షకుల్ని అలరించాలి. అప్పుడే పాటకున్న లక్ష్యం పూర్తవుతుంది. కొన్ని గీతాలైతే.. ఆ లక్షణాన్ని దాటుకొచ్చి, సినిమా స్థాయిని పెంచి, తమ ప్రత్యేకతను చాటుకొంటాయి. `ఆర్.ఆర్.ఆర్`లోని `నాటు నాటు` అలాంటి పాటే! `నాటు.. నాటు` పాట విడుదలైనప్పుడే … ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ నాట్యం తోడయ్యాక… ఆ పాటని రాజమౌళి తనదైన విజన్‌లో ఆవిష్కరించాక.. మరింత ఆదరణ సంపాదించుకొంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక `గోల్డెన్ గ్లోబ్ అవార్డు` అందుకొంది. `ఆస్కార్`కు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో… `నాటు నాటు` గీతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని… ఈ పాటలోని విశిష్టతనీ మరోసారి గుర్తు చేసుకొనే ప్రయత్నం చేస్తే…?!
* ఇది రాజమౌళి విజన్!!
తన సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రత్యేకంగా ఉండాలని తపించే దర్శకుడు రాజమౌళి. మాటైనా, పాటైనా, పోరాట ఘట్టమైనా… ప్రేక్షకుల ఊహకు అందనంత ఎత్తులో తీసుకెళ్లి.. నిలబెట్టాలన్నది ఆయన తపన. అందుకే… దేశం గర్వించదగ్గ దర్శకులలో ఆయన పేరు చేరిపోయింది. `ఆర్.ఆర్.ఆర్` ప్రాజెక్టు ప్రకటించినప్పుడే ఓ సంచలనం. ఎన్టీఆర్, రామ్‌చరణ్… ఇద్దరితోనూ రాజమౌళి ఏం అద్భుతాలు సృష్టిస్తాడో అని ప్రేక్షక లోకమంతా ఆసక్తిగా చూసింది. వీరిద్దరినీ వెండి తెరపై ఓకే ఫ్రేమ్‌లో చూడడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే… ఎన్టీఆర్, చరణ్‌లు కలుసుకొన్న ప్రతీ సన్నివేశాన్నీ, ప్రతీ ఫ్రేమునీ, ప్రతీ పాటనీ.. తనదైన శైలిలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు.
నాటు నాటు గీతం. ఇద్దరు కథానాయకుల నృత్య ప్రతిభకు ఓ వేదిక. వీరిద్దరి డాన్సింగ్ టాలెంట్ చూపించడానికి ఓ పాట కావాలి.. రాజమౌళి మదిలో మెదిలింది ఇదే. కీరవాణికి చెప్పిన మాట కూడా అదే. పాట రాయడానికి చంద్రబోస్ వచ్చేటప్పటికి కనీసం ట్యూను కూడా లేదు. సందర్భం కూడా పెద్దగా వివరించిందేం లేదు. `ఇంగ్లీషు వారిని పాటలో ఎక్కడా కించపరచకూడదు.. అప్పటికి సామాజిక ఆర్థిక స్థితి గతుల్ని తెలిపే పదాలే కావాలి` అన్నారంతే. అంతకు మించిన నోట్స్ ఏమీ లేదు. గీత రచయిత చంద్రబోస్‌కి ఇది సరికొత్త ఛాలెంజ్. రాజమౌళి సినిమాకి పనిచేయడం, కీరవాణిని సంతృప్తి పరచడం అంటే మాటలుల కాదు. లక్ష్యం పెద్దదే. కానీ కళ్ల ముందు ఇద్దరు హీరోలున్నారు. వాళ్ల ఇమేజ్ చంద్రబోస్‌కి తెలుసు. ఆ హీరోల్ని రాజమౌళి ఏ స్థాయిలో ఆవిష్కరించబోతున్నాడన్నదీ తెలుసు.
* 19 నెలలు మోశారు!
తల్లి కడుపులో బిడ్డ పెరిగేది తొమ్మిది నెలలే. కానీ… ఈ పాటని 19 నెలలు కడుపులో మోశారు చంద్రబోస్. `నాటు నాటు` అనే హుక్ లైన్ అందాక… మిగిలిన పాట పరుగెట్టింది. కీరవాణితో ఫస్ట్ మీటింగ్ అయ్యాక… రెండు రోజుల్లోనే మూడు పల్లవులు రాసి.. చూపించేశారు. కేవలం వాటిలో ఒకదాన్ని (ఇప్పుడు మనం వింటున్న పల్లవి) సెలెక్ట్ చేసేశారు కీరవాణి. మిగిలిన పాట మొత్తం రాయడానికి 19 నెలలు పట్టింది. మధ్యమధ్యలో ఎన్నో కరక్షన్లు. ఒకొక్క పదం పుట్టడానికి ఒక్కో రోజు పట్టేది. చివరికి పాట మొత్తం పూర్తయ్యాక… ఉక్రేయిన్‌లో చిత్రీకరించినప్పుడు చివరి లైన్లు మార్చాలి అని చెప్పారు. అప్పటికప్పుడు… హైదరాబాద్ లో ఉన్న చంద్రబోస్‌కి ఫోన్ చేస్తే.. ఆయన `పుష్ప` పాటల్లో బిజీగా ఉన్నారు. అయినా సరే… కేవలం 15 నిమిషాల్లో చివరి లైన్లు రాశారు.
భూమి దద్దరిల్లేలా
వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగరేలా
ఏసేయరో.. యకాయకి
నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా
దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో…. అప్పటికప్పుడు రాసి పంపారు.
* ఒక స్టెప్పు… 18 టేకులు
ఎన్టీఆర్,చరణ్‌లకు… రిహార్సల్స్ తో పనిలేదు. డాన్స్ మాస్టర్ `ఇలా చేస్తే..` అలా పట్టేస్తారు. అయితే… `నాటు నాటు` పాట… వీళ్ల డాన్సింగ్ టాలెంట్ కి అసలు సిసలైన పరీక్షలా నిలిచింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటని కంపోజ్ చేశారు. ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశారు ప్రేమ్ రక్షిత్. చరణ్, ఎన్టీఆర్‌లు చేతులు కలుపుతూ వేసే సిగ్నేచర్ స్టెప్పు కోసం 30 వెర్షన్లు తయారు చేశారు. ఆ స్టెప్పు కోసమైతే ఏకంగా 18 టేకులు తీసుకొన్నారు ఎన్టీఆర్. చరణ్. ప్రతీసారీ ప్రేమ్ రక్షిత్ `ఓకే` చేసినా.. రాజమౌళి `వన్ మోర్` అడిగేవార్ట. ప్రేమ్ రక్షిత్ కి సైతం కనిపించని… తప్పులు మోనేటర్ ముందున్న రాజమౌళికి కనిపించేవి. తెరపై ఇప్పుడు చూస్తున్న స్టెప్… రావడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టింది. ఈ పాటని..ఉక్రేయిన్‌లో షూట్ చేశారు. అక్కడ ప్రెసిడెంటు ప్యాలెస్ ముందు ఈ పాటని చిత్రీకరించారు. నిజానికి ఈ ప్యాలెస్ చూస్తే.. సినిమా సెట్టింగేమో అనిపిస్తుంది. కానీ అది నిజం కోట. ఈ ప్యాలెస్ ని ఓ సినిమా షూటింగ్ కోసం వాడుకోవడం ఇదే తొలిసారి. ఉక్రేయిన్ ప్రెసిడెంట్ కూడా ఒకప్పుడు సినిమా నటుడే. అందుకే సినిమాపై ఇష్టంతో.. షూటింగ్‌కి అనుమతి ఇచ్చారట.
వెండి తెరపై రాజమౌళి చేసిన మ్యాజిక్ ఏమిటంటే.. ఈ పాటలో కేవలం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నాట్య ప్రతిభే కాదు…. చాలా కోణాలు ఆవిష్కృతమవుతాయి. రామ్, భీమ్ ల స్నేహం ఎలాంటిది? భీమ్ కోసం రామ్ చేసిన త్యాగం ఏమిటి? తమకు నాట్యం గురించి తెలీదని విర్రవీగిన తెల్ల దొరకలకు తెలుగు వాళ్లు ఎలా సమాధానం చెప్పారు? భీమ్ తాను ప్రేమించిన బ్రిటీష్ దొరసాని మనసు ఎలా గెలుచుకొన్నాడు? ఇలా కథలోని కీలక భాగాన్ని ఒకే ఒక్క పాటలో.. చూపించేశారు రాజమౌళి.
* ప్రపంచం ఊగింది
తెలుగు పాట.. ప్రపంచమంతా వినిపించడం ఆశ్చర్యం కాదు.. ఓ అద్భుతం. ఆ ఘనత `నాటు నాటు`కి దక్కింది. కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో వందమంది విద్యార్థులు ఈ పాటని ఆలపిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. విదేశీ విద్యార్థులు `నాటు నాటు` అంటూ అచ్చమైన తెలుగులో పాట పాడడం.. పాటకు కాదు, భాషకు దక్కిన గౌరవం. `ఆర్.ఆర్.ఆర్` చిత్రానికి విదేశాల్లో లభించిన స్పందన గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ముఖ్యంగా `నాటు నాటు` పాట వస్తున్నప్పుడు తెర ముందుకెళ్లి సిగ్నేచర్ స్టెప్పులేసిన దృశ్యాలు కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు చేతికి చిక్కింది. ఇక ఆస్కార్ అందడమే తరువాయి. అది కూడా చేతికి చిక్కితే.. మరో అరుదైన ఘనత తెలుగు పాట సొంతం అవుతుంది.