‘బద్రి’… పూరి జగన్నాథ్ అనే ప్రతిభావంతమైన దర్శకుడ్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన సినిమా. హీరోయిజం, యాక్షన్, సీన్స్ డిజైన్ చేసిన విధానం అన్నీ కొత్తగా ఉంటాయి. ‘నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్’ అంటూ దూసుకుపోయే హీరోయిజం అభిమానులకు బాగా నచ్చింది. ఆ సినిమాతో మాస్ లో నిలబడిపోయాడు పవన్. ‘బద్రి’ విడుదలై నేటికి 20 ఏళ్లు. ఈ సినిమా వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది.
రాంగోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన పూరి.. పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రాసుకున్నాడు. కానీ పవన్‌ని కలిసి, కథ చెప్పే అవకాశం లేకుండా పోయింది. పూరికి శ్యామ్ కె.నాయుడు మంచి దోస్త్. వీరిద్దరూ దూరదర్శన్ కోసం పనిచేసేటప్పుడు స్నేహితులయ్యారు. శ్యామ్ ద్వారా… ఛోటా కె.నాయుడుని కలుసుకున్న పూరి.. ‘పవన్ కోసం నా దగ్గర ఓ కథ ఉంది. చెప్పే అవకాశంఇప్పించండి’ అని అభ్యర్థించాడు. ఛోటా.. వెళ్లి పవన్ కి చెప్పాలి. కాకపోతే… పూరి చెప్పిన కథ నచ్చకపోతే తనకి చెడ్డ పేరు వస్తుంది. అందుకే.. ‘ముందు ఆ కథ నాకు చెప్పు. నాకు నచ్చితేనే రికమెండ్ చేస్తాను’ అన్నాడు. బద్రి కథ చోటాకి నచ్చుతుందో లేదో అనుకుని.. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ కథ చెప్పేశాడు. అది ఛోటాకి నచ్చింది. దాంతో పవన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు చోటా.
తెల్లవారుఝామున 4 గంటలకు పవన్‌కి కథ చెప్పే అవకాశం దక్కింది పూరికి. అది కూడా అరగంట. పవన్ ఎక్సర్సైజులు చేసుకుంటుంటే పూరి కథ చెప్పాలి. అరగంట సమయం ఇచ్చినా, వారిద్దరి భేటీ మూడు గంటల పాటు సాగింది. కథ నచ్చింది కానీ.. ‘ఛోటా చెప్పిన లైన్ ఇది కాదు కదా’ అన్నది పవన్ అనుమానం. ‘అది ఛోటాకి ఇప్పించడానికి ఆయనకు చెప్పిన కథ..’ అంటూ పూరి రిప్లై ఇచ్చాడు. ఆ సమాధానం, పూరి చాతుర్యం పవన్‌కి నచ్చాయి. ‘కానీ క్లైమాక్స్ మార్చు’ అని సలహా ఇచ్చాడు పవన్. తప్పకుండా మారుస్తానని ఇంటికెళ్లిన పూరి.. కొన్నాళ్లకు స్క్రిప్టు మొత్తం వినిపించడానికి పవన్‌ని మళ్లీ కలిశాడు. ‘క్లైమాక్స్ మార్చావా?’ అని గుర్తు చేశాడు పవన్. ‘చాలా అనుకున్నా సార్. కానీ ముందు రాసిందే బెటర్ అనిపిస్తోంది’ అన్నాడు పూరి. ‘అవును.. నీ క్లైమాక్సే బాగుంది. నేను చెప్పాను కదా అని నువ్వు క్లైమాక్స్ మార్చేస్తావనుకున్నా. కానీ నువ్వు అలా మార్చలేదు. నువ్వు రాసిన క్లైమాక్స్ తోనే సినిమా ఫినిష్ చేద్దాం’ అంటూ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ‘బద్రి’ మొదలైంది.