చంద్రబాబు నమ్మకం ఉంచిన నేతలందరూ నట్టేట ముంచడంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఒక్క సారిగా బరస్టయ్యారు. చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించాలని నిర్ణయించారు. ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తేదీ వరకూ పర్యటన సాగనుంది. ఈ పర్యటన అంశంపై చర్చించేందుకు పార్టీ నేతలు , కార్యకర్తలు కుప్పంలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కార్యకర్తలు పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు గ్రామాల్లో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసి కూడా పట్టించుకోలేదని… అందుకే ఓటమి పాలయ్యామని మండిపడ్డారు.
కార్యకర్తల ఆగ్రహంతో చంద్రబాబు పీఏ మనోహర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మనోహర్ 30 ఏళ్లుగా చంద్రబాబు పీఏగా ఉంటూ కుప్పం బాధ్యతలు చూస్తున్నారు. సీఎంగానో ప్రతిపక్ష నేతగానో తీరిక లేకుండా ఉండే చంద్రబాబు… ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మనోహర్ ను పీఏగా పెట్టుకుని పనులు చక్క బెడుతున్నారు. మనోహర్‌తో పాటు ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు స్వగ్రామం కూడా కుప్పం పరిధిలోనే ఉంటుంది. అయినప్పటికీ…. పంచాయతీ ఎన్నికల్లో దారుణ పరాజయాలు ఎదురయ్యాయి.
కార్యకర్తలు తప్పు పట్టడంతో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న మునిరత్నం కూడా తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు కార్యకర్తలమధ్యనే కూర్చున్నారు. సొంత గ్రామంలో కూడా టీడీపీ మద్దతుదారు అభ్యర్థిని గెలిపించుకోలేకపోయానని ఆయన అలా చేశారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల ఆగ్రహంతో కుప్పంకు చెందిన పలువురు టీడీపీ నేతలు సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఈ నేతలందరూ.. చంద్రబాబు గుడ్ లుక్స్‌లో ఉండేందుకు రాజకీయం చేశారు.కానీ కింది స్థాయి కార్యకర్తల్ని పట్టించుకోలేదు. దీంతో ఫెయిల్యూర్ స్టోరీ ఎదురొచ్చింది. ఇప్పుడు.. చంద్రబాబు చేయాల్సింది నేరుగా కార్యకర్తలతో మాట్లాడటమే. అప్పుడైనా సమస్యకు పరిష్కారం దొరకొచ్చు.