ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి చెందిన రూ. నాలుగు వందల కోట్లను ఏపీ ప్రభుత్వం తమ స్టైట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయించుకుంది. నిబంధనల ప్రకారం ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి ఇవ్వాలి. అడిగిన 21 రోజులకల్లా తిరిగి ఇస్తామని ఎస్ఎఫ్సీ ఇచ్చిన ఒప్పందపత్రాల్లో ఉంది. ఇప్పుడు వర్శిటీ కార్యకలాపాల కోసం తమ వద్ద డబ్బులు లేవని ఉన్న పళంగా రూ. 175 కోట్లు కావాలని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ అధికారులు ప్రభుత్వానికి నెల రోజుల కిందట లేఖ రాశారు. ఈ లేఖను చూపించే ఉద్యోగులు కూడా ఆందోళన విరమించారు.
లెక్క ప్రకారం 21వ రోజున ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ ఖాతాలో రూ. 175 కోట్లు జమ కావాలి. కానీ నెల దాటినా పైసా కూడా జమ కాలేదు. పైగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఇలాంటి పరిస్థితి ఏంటో వర్శిటీ ఉన్నతాధికారులకు అర్థం కావడం లేదు. అదే బ్యాంక్ అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించే పరిస్థితి ఉండేది కాదు. తక్షణం నగదు యూనివర్శిటీ అకౌంట్లో పడేది. ఒక వేళ పడకపోతే.. బ్యాంక్ డీఫాల్టర్‌గా మారుతుంది. అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ఏ బ్యాంకూ ఆ పరిస్థితి తెచ్చుకోదు.
కానీ ఇక్కడ ప్రభుత్వ సంస్థే డిపాజిట్ తీసుకుంది. ఆ డిపాజిట్‌ను ప్రభుత్వం వాడేసుకుంది. ఇప్పుడుతిరిగి ఇవ్వాలంటేప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది లేకపోతే లేదు. ఎవరూ ప్రభుత్వంపై కోర్టుకెళ్లే ధైర్యం చేయలేరు. ఎందుకంటే వర్సిటీలో ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వ పెద్దల చల్లని చూపుతో వచ్చిన వారే. వారు కోర్టుకెళ్లరు. మరి యూనివర్శిటీ ఎలా నడుస్తుంది..? నడనవదు.. నడవకపోయినా అడిగేవారు ఎవరూ ఉండరు. మూసేసినా దానికి కారణాలు చెప్పుకుంటారు. ఇక అంతే..!