ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ… ఉన్నతాధికారులను కూడా వదలి పెట్టలేదు. వందల కోట్ల ఆస్తులు పోగేసిన అక్రమార్కులను.. ఎప్పటికప్పుడు బయటపెట్టి ఓ స్థాయి కలకలం రేపింది. తెలంగాణలోనూ.. అలాంటి అవినీతి ఉన్నతాధికారుల్ని… ఏసీబీ పట్టుకుంది. ఇలా దొరికిన వారిలో… తెలంగాణ ఇరిగేషన్ చీఫ్..సురేష్‌కుమార్ కూడా ఉన్నారు. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆదాయానికి మించి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు బయపడ్డాయి. వెంటనే ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. కానీ అనూహ్యంగా అదే ఏసీబీ అధికారులు కరీంనగర్ కోర్టులో అతని బెయిల్ పిటిషన్ ను వ్యతిరెకించకుడా ఎన్ఓసీ దాఖలు చేశారు. అయితే కరీంనగర్ కోర్టు సురేష్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కేసు పెట్టిన ఏసీబీనే ఏన్ఒసీ ఎలా ఇస్తుందని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
దీంతో ఏసిబి అధికారులు, సురేష్ బంధువులు హైకోర్టును అశ్రయించారు. అక్కడ ఆయనకు హైకోర్టులో బెయిల్ వచ్చింది. సోదాలు చేసి.. భారీగా ఆస్తులున్నట్లు గుర్తించి.. అరెస్ట్ చేసిన అవినీతి అధికారిపై … ఏసీబీ అంత సానుభూతి ఎందుకు చూపించిందన్నదానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో సాక్షాత్తూ… ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ఇరిగేషన్‌కు సంబంధించిన ఓ సమీక్షా సమావేశంలో… కొంత మంది అధికారులు సురేష్ కుమార్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారట. ఆయన గొప్ప నిజాయితీ పరుడని సర్టిఫికెట్ ఇచ్చారట. ఆయన కుమారుడు విదేశాల్లో సంపాదించి తీసుకొచ్చి… తండ్రికిచ్చారని చెప్పారట. దాంతో వెంటనే సీఎం కేసిఆర్ అక్కడి నుంచే ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావుకు ఫోన్ చేసి.. అన్యాయంగా అక్రమార్జన కేసులు పెట్టవద్దని సూచించారని చెబుతున్నారు. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే మాత్రం వదలొద్దని చెప్పి… సురేష్ కుమార్‌కు బెయిల్ వచ్చేలా చూడాలని ఆదేశించారట.
సురేష్ కుమార్‌పై అవినీతి కేసు, ఆ వెంటనే బెయిల్ వచ్చిన వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. కోట్ల కొద్దీ అక్రమాస్తులుతో దొరికిపోయిన హెచ్ఎండీఏ ఉన్నతాధికారి పురుషోత్తంరెడ్డి, శాట్ అధికారి వెంకటరమణ ఇంకా జైళ్లలోనే ఉన్నారు. కానీ కేసీఆర్ పుణ్యమా అని సురేష్ కుమార్‌కు వెంటనే బెయిల్ వచ్చింది. హెచ్ఎండీఏ అధికారి పురుషోత్తం రెడ్డిపై ఏసీబీ కేసు వెనుక కేసీఆర్ ఉన్నారని.. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. తన బంధువులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు పర్మిషన్ ఇవ్వలేదనే కక్ష తీర్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సురేష్ కుమార్ వ్యవహారంపై రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి..!