దేవతగా చెప్పుకుంటున్న రాథేమా గురించి మనం ఇప్పుడు ఎందుకంత హడావుడి చేస్తున్నాం? ఈ అమ్మోరు తైతెక్కలాడితే మనకేంటీ ? తందనాలాడితే మనకేంటని ఎందుకుని ఊరుకోవడంలేదు. ఈ విపరీత ప్రచారంవల్ల మనకొరిగేది ఏమిటి? ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా??
ఇప్పుడు సోషల్ మీడియాలో రాథేగురుమాసంచలనవార్తయ్యారు. రాథేగురుమాతని దేవతగా ఆరాధిస్తున్నవారి సంఖ్య తక్కువేమీకాదు. ఆమె దేవతా? కాదా? అన్నది పక్కనబెడితే, ఆమె చేష్టలు అంటే, చిత్రవిచిత్రంగా తైతెక్కలాడటాలు, మత్తెక్కినట్లు ఊగిపోవడం వంటి చేష్టలతో అందర్నీ ఆకట్టుకుంటున్నరన్నది నిజం. ఇదంతా దేవతాచేష్టలుగా భావించేవాళ్లు ఉన్నంతకాలం ఇలాంటి తైతెక్కలు చెల్లుబాటు అవుతూనే ఉంటాయి.
ఇప్పుడామె ఒక వరకట్నం కేసులో ఇరుక్కోవడం. దీనికితోడు మినీ స్కర్ట్ (పొట్టి గౌను)వేసుకుని అందాలు ఆరబోస్తూ ఫోటోలు దిగడమన్నది హాట్ టాపిక్ అయింది. అయితే, ఆమె పొట్టి గౌను వేసుకోవడం గురించి మన అదేపనిగా ఆలోచించాలా ? లేక వరకట్నకేసులో ఇరుకునపడటం గురించి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలా ?? నన్నడిగితే ఈ రెండూ కావంటాను. మరి అసలు సంగతేమిటి? దేన్ని అతిగా పట్టించుకోవాలి, మరిదేన్ని మనసులోనుంచి తృటిలో తీసిపారేయాలన్నదాని గురించి ఆలోచించాలి. చాలాచిత్రమేమంటే ఈ సమాజంలో చిన్నసమస్యను పెద్దదిగా భావిస్తుండటం. అలాంటప్పుడే సంచలవార్తలు పుట్టుకొస్తుంటాయి. అవే ప్రధానమనుకుంటారు. లేదా వాటిని తలుచుకుంటూ తెగమదనపడుతుంటారు. కానీ, సీరియస్ ప్రశ్నను పక్కనబెట్టేసి రాథే గురుమాత ఏదో తప్పుచేసినట్టు తెగఫీలవుతున్నాము. నిజానికి మనలోని జబ్బే అసలు సమస్య. దాని గురించి పట్టించుకోకుండా బాబాలు, స్వామీలు లేదా దేవతా మాతల లీలలు చెప్పుకుంటూ, భజనలు చేస్తూ, వారితో తైతెక్కలాడుతూ ఒకరకమైన మత్తులో పడిపోయి చివరకు మానసిక రోగులుగా మిగిలిపోతున్నాము.
ఎవరీ రాథేగురుమా ?
రాథే గురుమాత విషయానికి వద్దాం… ఆమె వయస్సు 49. ముగ్గురు పిల్లలు అయినా ఇప్పటికీ అందంగా ఉంటుంది. వచ్చే భక్తులతో మాట్లాడదు. కానీ వారితో డాన్స్ లు చేస్తుంది. అందమైన డ్రెస్ లు వేసుకుంటుంది. నైపుణ్యంగడించిన డాన్సర్ లా నర్తిస్తుంది. చూసేవారు అదికూడా ఒకరకమైన పూనకం అనుకోవాలి. సోషల్ మీడియాలో ఆమె ఎరుపురంగు మినీస్కర్ట్ వేసుకున్న ఫోటో ఒకటి కనిపించడంతో అదో హాట్ టాపికైకూర్చుంది. రాథేమా ఒక్కోసారి తన భక్తులను ముద్దాడుతుంది. కౌగిలించుకుంటుందికూడా. ఆమెకున్న భక్తగణంలో భోజ్ పూరీ నటుడు మనోజ్ తివారీ, టివీ నటి దోలీ బింద్రా, రవికిషన్ లాంటివాళ్లున్నారు. బయటప్రపంచానికి ఆమె ఎప్పుడూ గ్లామర్ గానే కనబడుతుంటారు. పైగా కోట్లకు పడగలెత్తినట్టు చెప్పుకుంటున్నారు. రాథేమాని చోటీమా అని, తల్లిబాబా అని కూడా పిలుస్తుంటారు. ఆమె మాట్లాడదు. కానీ పాటకు తగ్గట్టుగా భక్తులతోపాటుగా స్టెప్స్ వేస్తుంది.
ఆమె గురించిన నమ్మకాలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. ఆమె తన చేతిని భక్తుని శిరస్సుపై ఉంచితేచాలు, అతగాడి గుండెజబ్బు మాయమైపోయింది. ఇలాంటి లీలలు ఆమె పేరిట ఉన్న వెబ్ సైట్ http://www.radhemaa.com లో మనకు కనిపిస్తాయి. ఆమె దుర్గామాత అవతారమని భక్తుల్లో కొంతమంది నమ్ముతారు. అప్పుడప్పుడు ఆమె శివనిగా, ఆదిశక్తిగా కూడా మేకప్ వేసుకుని కనబడుతుంటారు.
రాథే గురు మా అసలు పేరు సిఖ్విందర్ కౌర్. ఆమె పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని దోరంగాలా గ్రామానికి చెందింది. 17ఏళ్ల వయసులో మోహన్ సింగ్ ను పెళ్ళిచేసుకుంది. భర్త ఉద్యోగంవేటలో ఖతర్ వెళ్లినతర్వాత ఆమె గాడ్ ఉమెన్ గా మారిపోయారు. తనకు అతీత శక్తులు వచ్చాయని చెప్పుకుంటారు.
ఆమె భక్తుల్లో ఒకరికి కట్నంతీసుకోవచ్చని చెప్పడంతో వరకట్నం కేసులో ఇరుక్కున్నారు. ఈకేసు నిందితుల్లో రాథేమాని కూడా చేర్చి పోలీసులు విచారణచేపట్టారు. నాసిక్ లో జరిగే మహాకుభమేళాకు రావద్దంటూ ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద్ తేల్చిచెప్పారు. ఆమె రావడంవల్ల నిజమైన సాధువులు, మహంత్ లకు చెడ్డపేరువస్తుందని అంటున్నారు.
రాథే గరుమాత చాలా తక్కువకాలంలోనే పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాను సైతం ఆమె హస్తగతం చేసుకున్నారు. ఆమె నడుపుతున్న ఫేస్ బుక్ పేజీని లక్షా21వేల 118 మంది ఇప్పటిదాకా ఫాలోఅవుతున్నారు. ఆమెను దేవతగా స్తుతిస్తూ పాటలు సిడీల రూపంలో జోరుగా అమ్ముడవుతుంటాయి. ఏ సోషల్ మీడియా ఆమెను ఇప్పుడు దుయ్యబడుతుందో అదే మీడియా ఆమె ప్రచారంలో కీలకపాత్రపోషిస్తున్నదంటేఆశ్చర్యంలేదు. ఆమె ఇప్పుడు పబ్లిక్ ఫిగర్.
బయటకు ఎప్పుడు వచ్చినా ఆమె ఫుల్ మేకప్ తోనే కనిపిస్తారు. దీనికితోడు పలచని దుస్తులు వేసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఫ్యాషన్ పెరేడ్ లో నడిచివస్తున్నట్టు అనిపిస్తుంటుందని కొందరు అంటారు. ఈమధ్యనే మనదేశంలో పోర్న్ వెబ్ సైట్లు బ్యాన్ చేయడం మొదలుపెట్టారు. బాగానేఉంది, మరి ఇలాంటి తైతెక్కలాటలను అశ్లీలంగా భావించాలా, లేక ఆధ్యాత్మిక ముసుగువేసుకున్న చేష్టలుగాభావిస్తూ ఊరుకోవాలా? దీనికి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.
పిచ్చివాళ్ల చేతిలో మతం
మతపరమైన ఆచారాలను బడా వ్యాపారాలకు ఉపయోగించడం మనదేశంలో మామూలైపోయింది. అందుకే ఊరుకో బాబా, పేటకో స్వామీజీ వెలుస్తున్నారు. ఒకడేమో నాకుడు బాబాను అంటాడు. అతగాడు నాకితే ఒంటిమీద పుండ్లుకూడా మాయమైపోతాయన్న ప్రచారం జరుగుతుంటోంది. అంతే భక్తులు క్యూకడతారు. మరొకడు తన్నుడు బాబాని అంటాడు. అతగాడు కాలితో భక్తులను తంతే, పాపాలు ఆ దెబ్బకు ఝడుసుకుని పారిపోతాయట. అలాగే జడలస్వామీ, గోళ్ల స్వామీ ఇలాంటి వాళ్లు పెరిగిపోతున్నారు. కచ్చితంగా మనమో విషయం గుర్తుపెట్టుకోవాలి. వీరిలో చాలామంది చిన్నతనం నుంచీ మానసిక రోగాలతో బాధపడుతున్నవారే. వారి వింత ప్రవర్తన, వింతైన మాటలన్నీ ఆరోగ లక్షణాలే. అలాంటి వ్యక్తి తనకు ఇష్టమైనా, ఇష్టంకాకున్నా బాబాగానో, లేదా స్వామీజీగానో కాకుంటే రాథేమాలాగా గురుమాతగానో మారిపోతారు. పిచ్చివాళ్లు ఆడే తైతక్కలే మనం ఆధ్యాత్మిక లీలలను అనుకుంటూ వారికి పాదక్రాంతులమవుతున్నాం. అంటే అసలు జబ్బు ఎక్కడుందీ? మనలో కూడా ఉంది.
ఈరోగానికి మందుకనిపెట్టాలేకానీ, పిచ్చివాళ్ల చేష్టలకు మతం రంగు పులుముకుంటూ, మనంకూడా పిచ్చివాళ్లం కాకుడదు. మన బలహీనతలతో వేలాది కోట్లు ఈ బాబాలూ, స్వామీజీలు ప్రోగేసుకుంటున్నారు. రాథేగురుమా ఆస్తి వేలకోట్లు చేరిందనే అంటున్నారు. మనదేశంలో బంగార నిల్వలు టన్నులకొద్దీ ఈ స్వామీజీలు, బాబాలదగ్గర మూలుగుతోంది. కానీ వారికున్న రాజకీయ పలుకుబడులవల్ల అవేవీ వెలుగుచూడవు. మతమౌఢ్యం ముసుగులో హత్యలు జరిగినా, కుట్రలు సాగినా వారి ఆశ్రమంలోకి పోలీసులు ప్రవేశించలేరు. అంత కట్టుదిట్టమైన కోటలను నిర్మించుకుంటారు.
ఇప్పుడు చెప్పండి, రాథేమా షార్ట్ స్కర్ట్ వేసుకున్నదనో, లేదా ఆమె వరకట్నం కేసులో ఇరుక్కున్నదన్న అంశాలను సంచలనం చేయడం ముఖ్యమా, లేక మనలో చైతన్యం కలిగించుకోవడం ముఖ్యమా? మీడియాతోపాటుగా సోషల్ మీడియా కూడా తప్పుదారిపట్టడం ఈ మొత్తం వ్యవహారంలో దురదృష్టకరమైన పరిణామం.
– కణ్వస