సీదిరి అప్పలరాజు.. ఫేస్ బుక్ పోస్టు పెట్టి బుక్కయ్యారు. తనకు రేషన్ బియ్యం అందిందని… గ్రామ వాలంటీర్ వ్యవస్థ గొప్పగా పని చేస్తుందని.. చెప్పుకునేందుకు.. ఉత్సాహంతో.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. ఇప్పుడు.. కవర్ చేసుకోవడానికి.. కథ, స్క్రీన్ ప్లే కోసం తంటాలు పడుతున్నారు. ఈ సీదిరి అప్పలరాజు ఎవరో కాదు.. ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొన్నటి ఎన్నికల్లో.. సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు శిరీషపై .. గెలుపొందిన నేత. ఆయనే తమ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకుందామనుకున్నారో.. గ్రామ వాలంటీర్ వ్యవస్థకు ఓ సర్టిఫికెట్ ఇద్దామనుకున్నారో కానీ… ఓ రేషన్ బియ్యం బస్తాను.. ముందు పెట్టి.. తన కుటుంబాన్ని వెనుక పెట్టి.. ఓ స్మైలీ ఫోటో దిగారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి… తను చెప్పాలనుకున్నది చెప్పారు.
రేషన్ కార్డు ఎలా వచ్చిందో స్క్రీన్ ప్లే అదుర్స్..!
కానీ ఆ ఫోటో సాక్షిగా అనేక అనుమానాలు బయటకు వచ్చాయి. అవి అప్పలరాజును చుట్టుముట్టాయి. మొదటిది… అసలు తెల్ల రేషన్ కార్డు కోటీశ్వరుడైన అప్పలరాజుకు ఎలా వచ్చింది..?. సీదిరి అప్పలరాజు కాస్త పేరున్న వైద్యుడు. మరీ నిరుపేద కుటుంబంలో ఏమీ పుట్టి పెరగలేదు. రేషన్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ కుటుంబం లేదు. అయినప్పటికీ.. రేషన్ కార్డు ఎందుకు తీసుకున్నారు..?. దీనికి అప్పలరాజు.. తాను తీసుకోలేదని.. చాలా కాలం కిందటే రద్దు చేయించానని.. మళ్లీ యాక్టివ్ అయ్యానని.. చెప్పుకొస్తున్నారు. ఒక సారి రద్దు చేస్తే… ప్రభుత్వం మారగానే ఆటోమేటిక్ గా యాక్టివ్ అయ్యేంత టెక్నాలజీ ఏపీ సర్కార్ వద్ద లేదు. కానీ కవర్ చేసుకోవడానికి ఈ కథ చెప్పకతప్పడం లేదు.
ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయిందట… ఈ సీన్ అదుర్స్..!
అసలు.. మెరుగైన పరిస్థితి ఉన్నప్పుడు.. అసలు రేషన్ కార్డు ఎందుకు తీసుకున్నారనేదానిపైనా.. ఎమ్మెల్యే మరో కథ చెబుతున్నారు. పాస్‌పోర్టు కోసం 2009లో అంటే.. పదేళ్ల క్రితం.. రేషన్ కార్డు అవసరం వచ్చి తీసుకున్నారట. అంటే.. తనకు అర్హత లేకపోయినా… అప్పుడు అక్రమానికి పాల్పడి రేషన్ కార్డు తీసుకున్నారు. అప్పట్నుంచి అది అలాగే కొనసాగుతోంది. రద్దు చేయమని.. చెప్పానని.. అధికారులు పట్టించుకోలేదని మరో కారణం చెప్పారు.
రేషన్ కార్డుపై అడ్రస్ ఎక్కడో ఉంటే.. రేషన్ ఇంకో చోట ఇచ్చారట..! ఇది సూపర్..!
ఇక్కడ.. అసలు విషయం ఏమిటంటే.. ఆయన 2009లో పాస్‌పోర్టు కోసం తీసుకున్నానని చెబుతున్న రేషన్ కార్డు… ఆయన స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవుల్తాడ గ్రామం అడ్రస్‌తో తీసుకున్నారు. ఒక వేళ రేషన్ కార్డు రద్దు కాకపోతే… రేషన్ తీసుకెళ్లి ఆ గ్రామంలో గ్రామ వాలంటీర్ ఇవ్వాలి. కానీ.. పలాస-కాశీబుగ్గపట్టణంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి గ్రామవాలంటీర్ బియ్యం బస్తాను తీసుకెళ్లి ఇచ్చారు. ఇదెలా సాధ్యమంటే… మరో స్క్రీన్ ప్లే ప్లే చేశారు ఎమ్మెల్యే. తన ఆధార్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా.. రేషన్ కూడా.. ఎక్కడ నివసిస్తే.. అక్కడకు వచ్చిందని కవర్ చేసుకున్నారు. కానీ అసలు రద్దు చేయమని చెప్పానని ప్రకటించుకున్న తర్వాత అసలు ఆధార్ కార్డుకు అనుసంధానం ఎందుకు చేసుకున్నారో… తర్వాత మరో కథ చెబుతారేమో..?
ఒక గొప్ప కోసం ఇంకెన్ని కథలు చెప్పాలో..?
పలాస ఎమ్మెల్యే.. ఏదో చెబుదామనుకున్నారు కానీ.. మొత్తానికి చాలా వాటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని ఊహించలేకపోయారు. ముందు ముందు ఇంకెన్ని ప్రశ్నలకు ఆయన కథ, స్క్రీన్ ప్లే చెప్పాల్సి ఉంటుందో..?