వచ్చినవాడు మోడీ. మంచిమాటల్ని మనసుకు హత్తుకునేలా చెప్పే మాటల మాంత్రికుడు. ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే సిసలైన రాజకీయ నాయకుడు. ప్రధాన మంత్రిగా తన రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచారు. అందుకోసం ఎంచుకున్న చోటు మొదలుకుని, ప్రస్తావించిన అంశాల వరకూ… ప్రతిదీ వ్యూహాత్మకమే. రిపోర్ట్ కార్డును సమర్పిస్తూనే, యూపీ ఎన్నికల నగారా మోగించారు మోడీ.
పనిచేయడం ఒకెత్తు. చేసింది చెప్పుకోవడం ఒకెత్తు. ఈ రెండింటిలోనూ మాస్టర్ అనదగ్గ నాయకుడు మోడీ. ఉత్తర్ ప్రదేశ్ సహారన్ పూర్ లో జరిగిన సభలో మోడీ ప్రసంగం అనేక విషయాలను సూచించింది. గతాన్ని వివరించింది. వర్తమానాన్ని ఆవిష్కరించింది. భవిష్యత్తు ఆకాంక్షను చాటిచెప్పింది. వచ్చే యూపీ ఎన్నికల్లో గెలవడమే ఆ ఆకాంక్ష. అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటూ, కనీసం ఒక్క రూపాయి లంచం తీసుకున్నామని ప్రతిపక్షాలు కూడా ఆరోపించలేక పోతున్నాయని గొప్పగా చెప్ప్పుకొన్నారు.
తన ప్రభుత్వ పథకాలను బోర్ కొట్టని విధంగా మొదట వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కోట్లాది కుటుంబాటు కట్టెల పొయ్యి వంటతో కుంగిపోవాల్సిందేనా ప్రశ్నించారు. కోట్ల మంది మహిళలు వంట పేరుతో కంట నీరు పెట్టాలా అన్నతీరు ఆలోచింపచేసేదిగా ఉంది. వచ్చే మూడేళ్లలో 5 కోట్ల కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబోతున్నామన్న మాట, పేద మహిళల మనసుకు హత్తుకుపోతుంది.
మోడీ ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రశంసలు పొందిన పథకం, మెరుగైన పంటల బీమా పథకం. మూడోవంతు పంట దెబ్బతిన్నా బీమా వర్తించేలా, ఇంకా అనేక విధాలుగా ప్రయోజనం కల్పించేలా కేంద్రం ప్రారంభించిన ఈ పథకం గురించి మోడీ ఘనంగా చాటుకున్నారు. కోట్లాది మంది రైతులకు భూసార పరీక్షా రిపోర్టులను ఇవ్వడం ఓ ఉద్యమంలా చేపట్టామని వివరించారు. అన్నదాత మన్ననలు పొందడానికి ఈ పథకాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇప్పటి వరకూ ఎవరూ ఇలా లక్షల మంది సమక్షంలో రిపోర్ట్ కార్డును ప్రజల ముందు ఉంచలేదనే మాట కూడా ఆలోచింపచేసేదే.
స్వామికార్యం, స్వకార్యం అంటారు. రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును ఇవ్వడంతో పాటు, మరో పనిని కూడా ఆయన చాకచక్యంగా పూర్తి చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించారు. సహారన్ పూర్ ను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. దాదాపు 45 శాతం ముస్లిం జనాభా ఉన్న ప్రాంతమది. అయినా, 2014లో బీజేపీ 65 వేల ఓట్ల మెజారిటీతో సహారన్ పూర్ సీటును గెల్చుకుంది. గురువారం నాటి మోడీ సభా వేదిక కోసం ఒక ముస్లిం రైతు తన 8 ఎకరాల భూమిలో చెరుకు పంటను నరికేసి ఇచ్చాడు. బీజేపీ నాయకులు నష్టపరిహారం ఇస్తామన్నా తీసుకోలేదు. అలాగే, వేల మంది ముస్లింలు మోడీ సభకు తరలివచ్చారు.
యూపీలో వరసగా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు. చెరుకు రైతుల కష్టాలు ప్రస్తావించారు. వారికి తగిన ధర చెల్లించాలని చక్కెర ఫ్యాక్టరీ యజమానులను హెచ్చరించారు. యూపీలోని పలు అంశాలను ప్రస్తావించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్చ, తనదైన శైలిలో మోడీ ప్రసంగించారు. కేడర్ కు కొత్త ఉత్తేజాన్నిచ్చారు. ఈ ఊపు ఎన్నికల వరకూ కొనసాగించడానికి పక్కా ప్లాన్ వేసేందుకు అమిత్ షా ఉండనే ఉన్నారు.