సినిమా తీయడం, దాన్ని హిట్టు చేసుకోవడం అటుంచండి. అందులో రాజమౌళిని కొట్టేవాడే లేడు. తన మార్కెట్ చేసుకోవడంలోనూ రాజమౌళిని మించినవాడు లేడు. సినిమా సినిమాకీ తన కథల పరిధి, బడ్జెట్, మార్కెట్ విపరీతంగా పెరుగుతూనే ఉంది. కొత్త ఆలోచనలకు పట్టం కడుతూ ముందుకు పోతూనే ఉన్నాడు. తాజాగా `ఆర్.ఆర్.ఆర్` విషయంలోనూ రాజమౌళి స్ట్రాటజీ చూస్తుంటే ముచ్చటేసేస్తోంది.
కథ గురించి ముందే చెప్పేయడం, ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడం రాజమౌళికి ఉన్న ఆనవాయితీ. దాన్ని ఈ సినిమాతోనూ ఫాలో అయిపోయాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్లని ప్రధాన పాత్రలుగా చేసుకుని, దాన్ని ఫిక్షన్ గా మలచుకోవడం.. రాజమౌళి ఆలోచనా పరిధికి అద్దం పడుతోంది. నిజానికి ఇప్పుడున్న స్థితిలో రాజమౌళి కొమరం భీమ్ కథ చేసినా, అల్లూరి సీతారామరాజు కథ చేసినా వేరే స్థాయిలో ఉంటుంది. బాహుబలిలానే ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాకి తగిన మార్కెట్ సృష్టించుకోగలడు. వాళ్ల బయోపిక్‌లోని డ్రామాని పిండి పిప్పి చేసి – ఓ కొత్త అద్భుతాన్ని ఆవిష్కరించే సత్తా రాజమౌళికి ఉంది. కానీ అలా చేస్తే… అది బయోపిక్ అయిపోతుంది. ఓ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించడం మినహా రాజమౌళి ముద్ర ప్రత్యేకించి ఏమీ ఉండదు. అందుకే బయోపిక్‌లాంటి బయోపిక్‌ని తీయాలని డిసైడ్ అయ్యాడు. అదీ ఒక్కరిది కాదు.. ఇద్దరిది.
ఒకే కాలానికి చెందిన రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యోధులు కలుసుకుంటారా? కలుసుకుంటే వాళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందన్నది పూర్తిగా రాజమౌళి ఊహా. ఈ మధ్యలో తాను ఎలాంటి కథ అయినా చెప్పొచ్చు. ఇద్దరు హీరోల కోసం తయారు చేసిన మామూలు కమర్షియల్ కథని ఇద్దరు యోధుల జీవితాలకు రిప్లీకాగా చూపించొచ్చు. అది పూర్తిగా దర్శకుడి స్వేచ్ఛ. కానీ తెరపై ఓ అల్లూరి సీతారామరాజుని చూస్తున్నాం.. ఓ కొమరం భీమ్‌ని చూస్తున్నాం.. అన్న ఫీలింగ్ మాత్రం ప్రేక్షకులలో కల్పించాలి. అలా చేయగలిగితే… బయోపిక్‌లను మించిన కథ అవుతుంది. ఆ విషయంలో రాజమౌళిది అందవేసిన చేయే. అందులో సందేహం ఏమీ లేదు. పైగా ఒకరు ఆంధ్రా నుంచి మరొకరు తెలంగాణ నుంచి సుప్రసిద్దులు. రెండు కుటుంబాల హీరోలతోనే సినిమా చేస్తున్నాడనుకుంటే.. రెండు ప్రాంతాల వీరుల్ని కూడా అదే సినిమాలోకి తీసుకొచ్చాడు. ఇదంతా రాజమౌళి స్ట్రాటజీ.
కథ ముందే చెప్పేయడం కచ్చితంగా ఈ సినిమాకి కలిసొచ్చేదే. ఎందుకంటే.. ఈ సినిమా కథ ఇదంటూ ఎన్నో కథలు చక్కర్లు తిరిగాయి. అవన్నీ నిజమే అని నమ్మేసి, థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుడికి అంతకు మించిన కథేదో చూపిస్తే…అంసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకే.. తన సినిమాపై రకరకాల కథలు, కథనాలూ బయటకు రాకుండా ముందే జాగ్రత్త పడ్డాడు. ప్రెస్ మీట్లో భాగంగా జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషనల్ కూడా సినిమాపై జనాలకు ఉండే సాధారమైన సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశాడు. ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరి పాత్ర తక్కువ అనే అర్థం లేని ప్రశ్నల్ని, సందేహాల్నీ ఇక ముందు చరణ్ ఫ్యాన్స్‌కీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కీ రాకుండా తన సమాధానాలతో సంతృప్తి పరచగలిగాడు.
రిలీజ్ డేట్ ముందే ప్రకటించడం రాజమౌళి కొత్త గేమ్ ప్లాన్. ఇది పాన్ ఇండియా ఇమేజ్‌తో తయారవుతున్న సినిమా. తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లోనూ బెర్తు ఖాయం చేసుకోవాలి. అందుకే 15 నెలల ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశాడు. రాజమౌళి సినిమా వస్తోందంటే.. బాలీవుడ్ సినిమాలూ వెనక్కి వెళ్లాలి కదా? అందుకే ఆ స్పేస్ వాళ్లకు ఇచ్చాడు. నటీనటుల ఎంపికలోనూ రాజమౌళి తన మార్క్ చూపించాడనే చెప్పాలి. అజయ్ దేవగణ్, అలియాభట్ ఎంపిక హిందీ చిత్రసీమ కోసమైతే, సముద్రఖనిని తీసుకురావడం తమిళ ప్రేక్షకుల కోసం. ఈ సినిమాలో మిగిలిన ఇంకొన్ని పాత్రధారుల ఎంపికలోనూ అన్ని ప్రాంతాల వారికీ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు జక్కన్న. ఇంతకంటే మార్కెట్ స్ట్రాటజీ ఏముంటుంది?