కాపుల రిజర్వేషన్ల ఉద్యమానికి రాజకీయ రంగు వేసే ప్రయత్నం సాక్షాత్తూ అధికార పార్టీ తెలుగుదేశం చేస్తుడటం విశేషం! ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. కిర్లంపూడి దాటి ముద్రగడ బయటకి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదని చెప్పొచ్చు. పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. సరే.. ఇదే సమయంలో కాపుల రిజర్వేషన్ల అంశంలోకి ప్రతిపక్ష వైసీపీని లాగే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు. కాపు రిజర్వేషన్ల అంశమై చట్టపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు. ఇవేవీ గమనించకుండా ముద్రగడ వైసీపీ కోసం పాటుపడుతున్నారనీ, ఆ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న వ్యూహంతో లేఖలు రాస్తున్నారంటూ ఆరోపించారు.
ఇచ్చిన మాట ప్రకారమే అన్నీ జరుగుతూ ఉన్నాయనీ, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామనీ, కమిషన్ ను కూడా నియమించామన్నారు. కాపు విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపుతున్నామని ఆయన అన్నారు. కాపులను టీడీపీ నుంచి దూరం చేసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు! మొన్నటికి మొన్న ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇలానే మాట్లాడారు. ముద్రగడను జగన్ రెచ్చగొడుతున్నారనీ, కులాలూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ఒక పక్క మంద కృష్ణ మాదిగను రెచ్చగొడుతూ, మరోవైపు ముద్రగడకు మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు అన్నారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఇదే తరహాలో మాట్లాడారు! రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న జగన్ కావాలా..? రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న నాయకుడు కావాలా తేల్చుకోవాలన్నారు. మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ… కాపులకు అన్యాయం చేసిన వైయస్ గురించి ముద్రగడ మాట్లాడటం లేదనీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి ఉన్న తెలుగుదేశంపై విమర్శలు చేయడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు.
గడచిన రెండుమూడు రోజుల్లో కాపు రిజర్వేషన్ల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్న ప్రతీ సందర్భంలో జగన్ ప్రస్థావన తీసుకొస్తున్నారు. ముద్రగడ ఉద్యమం వెనక ఉన్నది ఆయనే అని చిత్రించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఇంకా కట్టబడే ఉన్నామని చెబుతున్నారు! కమిషన్ వేశాం, కార్పొరేషన్ ఇచ్చాం చాలదా.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేస్తే రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాం అన్నట్టుగా ఉంది అధికార పార్టీ మంత్రుల వైఖరి. మొత్తానికి, ఈ అంశాన్ని మరింత కొనసాగించే మూడ్ లోనే టీడీపీ ఉందని అర్థమౌతోంది. దీనికి ఇక్కడితో ఒక ముగింపు పలుకుందాం అనే వ్యూహం కనిపించడం లేదు! అయినా, ముద్రగడ ఉద్యమం వెనక జగన్ ఉన్నారని పదే పదే చెబుతూ ఉండటం ద్వారా… ఆ సామాజిక వర్గాన్ని జగన్ ను వారే దగ్గర చేస్తున్నట్టుగా అనిపించడం లేదూ..!!