టీఆర్ఎస్లో మా కట్టప్పలున్నారు అని ఢిల్లీ నుంచి లక్ష్మణ్ వార్నింగ్ ఇస్తారు. ఏక్ నాథ్ షిండేలూ ఉన్నారని బండి సంజయ్ అంటారు. తాము ఎప్పుడు చిటికేస్తే అప్పుడు వారంతా టీఆర్ఎస్ను చిందర వందర చేస్తారని చెబుతున్నారు. నిజానికి మహారాష్ట్రలో బీజేపీ ఇలా ఎప్పుడూ సవాల్ చేయలేదు. చేయాలనకున్నది చేసి చూపించింది. కానీ ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం అంతకు మించి హడావుడి చేస్తున్నారు. టీఆర్ఎస్ను టెన్షన్ పెట్టడానికే ఇలా చేస్తున్నారు కానీ ఇప్పటికైతే బీజేపీలో చేరికల సూచనలే లేవని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీజేపీకి మంచి హైప్ మీడియాలో ఉంది. జనంలో ఉందో లేదో తెలియదు. అంతకు మించి ఆ పార్టీకి క్యాడర్ లేదు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట మాత్రం బీజేపీ ఉనికి కనిపిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పాతబస్తీ ఆనుకుని ఉన్న ప్రాంతం ఇలా కొన్ని ప్రాంతాల్లో క్యాడర్ ఉంది. మిగిలిన చోట్ల చేరికలపైనే ఆధారపడాలి. కానీ చేరికలే లేవు. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని చేర్చుకోవడానికి చాలా సార్లు చర్చలు జరపాల్సి ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. చేరికలన్నీ కాంగ్రెస్‌లోనే ఉంటున్నాయి. ఇప్పుడు ఈటల నేతృత్వంలో చేరిక కమిటీ నియమించారు.
ఈ కమిటీ ఒక్కర్ని కూడా ఇంకా చేర్చలేదు కానీ ఉద్దృతంగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. అయితే బీజేపీలో ఈటల వర్సెస్ బండి సంజయ్ అన్న సీన్ ఉంది. ఈటల ఎవరినైనా పార్టీలో చేర్చితే వారికి ప్రాధాన్యం దక్కదని.. టిక్కెట్ కూడా రాదని బండి సంజయ్ వర్గీయులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈటలను నమ్మి పార్టీలో చేరడానికి ఎక్కువ మంది సిద్ధం కావడం లేదు. ఎలాగోలా కొంత మందిని చేర్చుకుదామని ప్రయత్నిస్తున్నా… కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందిస్తోంది.
నిజంగా టీఆర్ఎస్లో బీజేపీకి కట్టప్పలు , షిండేలు ఉంటే ఈ పాటికి తెరపైకి వచ్చి ఉండేవారని… ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన ఈ సమయంలో వారు బయటకు రాకుండా ఇంకెప్పుడు వస్తారని టీఆర్ఎస్ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని.. అయితే అది వర్కవుట్ కావడం లేదని అంటున్నారు.