తుపాను వస్తుందని తెలిసినప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకుని ఆస్తి, ప్రాణనష్టం కాపాడటం పరిపాలన. అలా కాకుండా మొత్తం అయిపోయాక మిగిలిన వారి దగ్గరకు వెళ్లి.. నా వల్లే మీరంతా ఉన్నారని లేకపోతే ఏం జరిగేదోనని ప్రచారం చేసుకోవడం రాజకీయం. అలా కాకుండా విపత్తుకు తానే కారణమై.. ముంచుకొస్తున్నా పట్టించుకోకుండా.. చివరికి దేశానికి నష్టాలు.. ప్రజల కష్టాలకు కారణమైతే అది వినాశకర రాజకీయం. ప్రస్తుతం దేశంలో మూడో టైప్ నడుస్తోంది. రాజకీయ అంశాలను పక్కన పెడితే ఆర్థిక పరమైన విషయాల్లో దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయానికి ముడిపెట్టి తీసుకుంటున్న నిర్ణయాలతో మరింత చేటు కలుగుతోంది. అయినా పాలకులు కళ్లు తెరుస్తున్నట్లుగా అనిపించడం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇలాగే ఉన్నాయి. భారత్‌కు ఉన్న అద్భుతమైన సౌలభ్యాలను పక్కాగా వాడుకుని ముంచుకొస్తున్న ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాల్సింది పోయి.. వేగంగా ఎదురెళ్లి ఇతర అగ్ర దేశాల కన్నా ముందే సంక్షోభంలో పడే పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నారు. దానికి తొలి సంకేతం రూపాయి పతనం.
రూపాయి పతనం – ఆర్థిక వ్యవస్థ పతనానికి సూచిక !
”యుపిఏ ప్రభుత్వం ఏర్పడినపుడు డాలరు-రూపాయి దామాషా రాహుల్ గాంధీ వయసుతో సమానంగా ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ వయసుకు దగ్గరగా ఉంది. అది మన్మోహన్ సింగ్ వయసును తాకుతుందేమోనని నిజంగానే భయపడుతున్నాం” అని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న చివరి రోజుల్లో బీజేపీ చేసిన వెటకారం ఇది. రూపాయి పతనం అవుతూంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి. ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని దేశం ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంక్షోభంలో నాయకత్వానికి ఎటు పోవాలో తెలియకపోతే తరువాత నిరాశ పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పటికీ తీసుకోవడం లేదు. ఇతర కరెన్సీలు కూడా పతనమౌతున్నంత కాలం…రూపాయి 80 రూపాయలకు పతనమైనా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు అని కొన్నాళ్ల కిందట బీజేపీ ఆర్థిక మేధావులు వాదించడం ప్రారంభించారు. ఇప్పుడు రూ. 80కి చేరుకుంది ఇంకా తగ్గిపోతుందని చెబుతున్నారు. పదేళ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో ఇప్పుడు రూ. 80 దాటింది. పదేళ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్ర మోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్ సింగ్ సర్కార్‌ను దులిపివేశారు. కానీ ఇప్పుడు మోడీ సర్కార్ నిర్వాకానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఎవరైనా అప్పట్లా విమర్శించేవారు ఉంటే… ఈడీ, ఐటీ రంగంలోకి దిగిపోతాయి. అందుకే ఎవరూ నోరెత్తడం లేదు.
తగ్గిపోతున్న విదేశీ మారక ద్రవ్యం !
రూపాయి ఐదు నెలల్లో ఐదు రూపాయలు పతనమైంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచితే మరింతగా కూడా పతనం కావచ్చు. గత ప్రభుత్వం ఎఫ్‌డిఐ, ఎఫ్‌ఎఫ్‌ఐల మీద ఆధారపడిన కారణంగానే పతనం అన్న నరేంద్ర మోడీ ఇప్పుడు అదే కారణాలతో అంతకంటే ఎక్కువగా పతనం చెందుతున్నా మాట్లాడటం లేదు. పతనాన్ని అరికట్టేందుకు ఆర్బిఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతున్నది. డిసెంబరులో 31 నాటికి మన దేశ విదేశీ మారక ద్రవ్యం 633.6 బిలియన్ డాలర్లుండగా జూన్ 24న 593.3 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2022లో 95.6 బిలియన్ డాలర్ల మేర చమురు దిగుమతులు చేసుకోగా, ఈ ఏడాది ఆ మొత్తం 145-150 బి.డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. షేర్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులను వెనక్కు తీసుకోవటమే ప్రస్తుత భారీ పతనానికి కారణం. మన దేశం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నందున రూపాయి పతనం కారణంగా ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. దాంతో దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి.
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం – చర్యలు శూన్యం !
ప్రపంచం మొ మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. గత ఆరునెలల కాలంలో మూడు సార్లు ప్రపంచ వృద్ధి రేటును ఐఎంఎఫ్ సవరించింది. 2021లో 6.1శాతం ఉన్న ప్రపంచ వృద్ధి రేటు 2022లో 3.6శాతం ఉంటుందని గతంలో చెప్పిన దాన్ని సవరించనున్నారు. ప్రస్తుతం అస్థిరపరిస్థితిలో ఉన్నామని ఈ ఏడాది ఎంతో కష్టతరంగా ఉండగా 2023 మరింత కఠినంగా ఉంటుందని, మాంద్యం ముప్పు పెరిగిందని చెబుతోంది. భారత్ పైనాఈ ప్రభావం ఎక్కువే ఉంటుంది. 2023 భారత జీడీపీ వృద్ధిరేటు 4.7 శాతానికే పరిమితం అవుతుందని జపాన్ బ్రోకరేజి కంపెనీ నోమురా తెలిపింది. గతంలో ప్రకటించిన అంచనా 5.4 శాతాన్ని కుదించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు కూడా వచ్చే ఏడాది భారత వృద్ధిరేటుకు గండి కొడతాయని స్పష్టం చేసింది. నెల నెలా రికార్డు స్థాయిని తాకుతున్న వాణిజ్య లోటు, పుంజుకోని ప్రైవేటు పెట్టుబడులు, విద్యు త్ కొరత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు నిదానించడం వంటి పరిణామాలు వచ్చే ఏడాది భారత్‌పై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అమెరికా వేసిన అంచనా ప్రకారం.. మైనస్ జీడీపీ ఉంటుందని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేసి మరింత ఆందోళన పెంచారు. పన్నెండు నెలల కాలంలో ప్రధాన ఆర్ధిక వ్యవస్థలన్నీ మాంద్యంలోకి జారతాయని హెచ్చరించింది. అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా వచ్చే ఏడాది మాంద్యానికి గురయ్యే చాన్స్ ఉంది.
ద్రవ్యోల్బణంతో ప్రజల జీవితం అస్తవ్యస్తం !
మన దేశం ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపుదల కారణంగా మన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలు వెనక్కు వెళ్లిపోతుండటంతో మన విదేశీమారకద్రవ్య నిల్వలు తగ్గుతున్నాయి. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ కావటంతో వాణిజ్యలోటు పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది. గత తొమ్మిది నెలల్లో స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కు వెళ్లిన విదేశీ పెట్టుబడుల మొత్తం రూ.2.55 లక్షల కోట్లు . ప్రతి వైఫల్యానికి పాలకులు దాని పేరే చెబుతున్నారు. మన దేశంలో కొనుగోలు శక్తి పడిపోయి సమస్యలు తలెత్తుతున్నాయి. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తే మాంద్యం అక్కడికే పరిమితం కాదు. మన వస్తువుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భద్రమైన చేతుల్లో దేశం ఉందని చెబుతున్నవారు ఇప్పుడు అంతా మన చేతుల్లో లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇదే దేశ ప్రజల్ని ఆందోళన కలిగిస్తున్న అంశం.
నిర్మాణాత్మక చర్యలేవి – జరిగేదేదో జరుగుతుందనుకుంటే పాలకులెందుకు ?
భారత ఆర్థిక వ్యవస్థకు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ప్రపంచంలోని చాలా దేశాలు మాంద్యం బారిన పడినా భారత్ మాత్రం తట్టుకుంది. దానికి భారత్ వ్యవసాయంపై ఎక్కువగా ఆదారపడటం.. పారిశ్రామికంగానూ ఇతర దేశాలపై ఎక్కువ ఆధారపడకపోవడం కారణం. కానీ ఇప్పుడు చాలా వరకూ నినాదాలు అమల్లోకి వచ్చాయి కానీ కార్యాచరణకు రాలేదు. చివరికి ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఓ రాజకీయఆలోచన చేశారు కానీ.. దానికి తగ్గ జెండాలుతయారు చేసే సామర్థ్యం మన దగ్గర లేదని చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంచే ముందు చూపు లేదని అర్థమవుతోంది. రూపాయి పతానాన్ని ఆపడానికి కానీ.. ద్రవ్యోల్బణం కట్టడికి కానీ.. మేకిన్ ఇండియాను సాధ్యం చేయడానికి కానీ జరుగుతున్న ప్రయత్నాలు అంతంతమాత్రమే. జరిగేది జరుగుతుందని కరోనా సమయంలో వ్యవహరించినట్లుగానే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వియంలోనూ అనుసరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా బాధ్యతా రాహిత్యమే. నమ్మి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకోకపోవడమే.
రాజకీయాలు పక్కన పెట్టాల్సిన సమయం.. దేశం కోసం ధర్మం కోసం ఆలోచించాల్సిన అవసరం !
ప్రపంచ గమనాన్ని చూసి ఇప్పుడు దేశం జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులను నియంత్రించుకోవాలి. ఖర్చులను ఆపుకోవాలి. సంపద సృష్టికి వీలైనంతగా వెచ్చించాలి. ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఓ కంట కనిపెడుతూ ముందుకెళ్లాల్సిన సమయం. ఇలాంటి సమయంలో జీఎస్టీ స్లాబులు పెంచుకుని ఆదాయం పెరిగితే.. అదే అభివృద్ధి అని చెప్పుకుని సంతోషపడితే అంత కంటే దేశానికి చేసే నయ వంచన మరకటి ఉండదు. కేంద్రానికి ప్రత్యేకమైన అస్థిత్వం ఉండదు. రాష్ట్రాలన్నీ బలంగా ఉంటేనే … దేశం బలంగా ఉన్నట్లు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాలు అప్పులు చేస్తూ.. దివాలా అంచుకు చేరుతున్నాయి. మాంద్యమంటూ ముంచుకు వస్తే అలాంటి రాష్ట్రాలే దేశానని ముంచుతాయి.
ఇప్పటికైనా రాజకీయాలను… పూర్తిగా పక్కన పెట్టి.. పూర్తిగా ఆర్థిక వ్యవహాలను చక్క బెట్టి.. దేశాన్ని సంక్షోభం బారి నుంచి బయటపడేయడానికి మార్గాల్ని అన్వేషించాల్సి ఉంది. లేకపోతే.. ఆ తర్వాత ప్రజలు పడే కష్టాలకు బాధ్యులవుతారు. అలా వారు కష్టాలకు గురయితే.. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచినట్లే… !