ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం. తండ్రి ఫీజు కట్టడం కోసం ఐదు రూపాయలు.. పది రూపాయల వడ్డీకి తెచ్చి వారితో మాటలు పడటం చూడలేక.. తానే భారమయ్యాయనని ప్రాణం తీసుకుంది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనాత్మకం అవుతోంది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడం లేదు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన కొద్ది బకాయిల్ని చెల్లించిన తర్వాత.. ఇక నుంచి కాలేజీలకు రీఎంబర్స్ మెంట్ లేదని.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ వేసిన పాపాన పోలేదు. దీంతో కాలేజీలన్నీ విద్యార్థుల వద్ద ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
తేజశ్రీ ఆత్మహత్యపై ముందుగా చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైంది?.. నాడు- నేడు అంటూ కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించమని.. కాలేజీ యాజమాన్యాలు చెబుతుంటే విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు.. పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ తేజశ్రీ ఆత్మహత్య అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అందరూ మోహన్ బాబునే గుర్తు చేసుకుంటున్నారు.
గత ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదని… ఆయన తన కాలేజీ విద్యార్థుల్ని తీసుకుని రోడ్డుపై పడుకుని ప్రదర్శన చేశారు. నిజానికి అప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్‌గా చెల్లిస్తోందని..ఆ త్రైమాసికానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ నడుస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయినా ఆయన ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఆందోళన చేశారు. చేయాల్సిన ఆరోపణలు చేశారు. తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఓ ఇంటర్యూలో ఇప్పుడూ తనకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రావడం లేదని… ఆస్తులు తాకట్టు పెట్టుకున్నానని బాధపడ్డారు. కానీ ఆయనకు రావాల్సిన ప్రయోజనం వచ్చి ఉంటుంది కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారని.. ఇతర కాలేజీల గురించి ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించాల్సింది మోహన్ బాబే.