విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి… ఇది కడప జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన! ఇంతకీ ఆ ముట్టడి ఎందుకంటే, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై జరుగుతున్న జాప్యానికి నిరసనగా! విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం విద్యార్థులు చెయ్యడం, పోలీసులు అడ్డుకోవడం.. కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే, ఈ నిరసన కార్యక్రమాలన్ని ప్రతిపక్ష పార్టీ వైకాపా ముందుగానే ఓన్ చేసుకుంది! విద్యార్థులకు నిరసనకు మద్దతుగా వైకాపా స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. విద్యార్థులను పోలీసులను అడ్డగించడంతో.. వైకాపా నేతల వెర్షన్ ఏంటంటే, నాలుగేళ్లపాటు కేంద్రంలో టీడీపీ కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించిందనీ, ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తోందంటూ విమర్శలకు దిగారు.
ఇక, ప్రతిపక్ష నేత జగన్ అయితే… ఈ ఘటనపై ఇంకోరకంగా స్పందించారు. విద్యార్థులపై పడ్డ ఒక్కొక్క లాఠీ దెబ్బ, రాష్ట్ర ప్రజల గుండెల మీద మీరు చేస్తున్న గాయమే అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు! కేసుల కోసం, లంచాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేయడం వల్లనే ఇవాళ్ల విద్యార్థుల, విపక్షాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ విమర్శించారు. గతంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించండని ఇలానే ఉద్యమిస్తే, తుపాకులతో కాల్పులు జరిపించారన్నారు! ఇప్పుడు టీడీపీ పాలనలో వంచనల మీద ప్రజలు గర్జిస్తున్నారనీ, చేతలతో సమాధానం చెప్పలేక లాఠీలూ తుపాకులతో సమాధానం చెప్తారా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగన్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సింది కేంద్రం! సాధ్యం కాదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి, సాధ్యం కాకపోయినా రాజకీయ నిర్ణయంతో ఇస్తామని చెబుతున్నదీ కేంద్రమే. పోనీ, కడప కర్మాగారంపై రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుందా అంటే.. ఆ పరిస్థితీ లేదు. ఎంపీలు దీక్షలు చేశారు. కేంద్రంపై అదేపనిగా పోరాడుతున్నారు. రెండ్రోజుల కిందటే కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్, రాష్ట్రపతి కోవింద్ లను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెయ్యాల్సిన ప్రయత్నాల్నీ జరుగుతున్నాయి. ఇదంతా విద్యార్థి లోకానికి తెలియంది కాదు కదా! అయితే, కేంద్రంపై నిరసన కార్యక్రమం జరిగితే.. దాన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న యాంగిల్ ను మాత్రమే జగన్ చూస్తున్నారు. ఆయన ట్వీట్ లో ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సూటిగా స్పందించిన తీరు కనిపించదు. విద్యార్థులు ఉక్కు కర్మాగారం కోసం నిరసన తెలిపితే.. దాన్ని వైకాపా ప్రయోజనాలకు అనుగుణంగా జగన్ స్పందించారు.