ఫారిన్ వెళ్లాలి..ఎంతో కొంత సంపాదించాలి అనే మైండ్ సెట్‌తో ఉండే యువతకు, వారి తల్లిదండ్రులకు ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులే. అమెరికాలో చదువు కోసం వెళ్లిన వారు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి ఖర్చులకు తాము సంపాదించుకునే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు డబ్బులు పంపాల్సిందే. ఇప్పుడు యూరప్ లోనూ అలాంటి గడ్డు పరిస్థితి వచ్చింది. యూత్ ప్రధాని స్టార్మర్ ఇలా తాము కూడా డిపోర్ట్ చేయబోతున్నామని ప్రకటించిన ఒక్క రోజులోనే ఆపరేషన్ ప్రారంభించారు. యూకే వ్యాప్తంగా అక్రమంగా పని చేస్తున్న వారందర్నీ తిరిగి వారి వారి దేశాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసేశారు.
యూరప్ దేశాల నుంచీ డిపోర్టేషన్
అమెరికా వెళ్లలేని వారు అత్యధిక మంది యూరప్ దేశాలకు వెళ్తున్నారు. అనేక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు అక్కడి యూనివర్శిటీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నాయి. అక్కడకు వెళ్లి వారు చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకోవాలని కాదు. అక్కడ చదువుకున్న వారిలో కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగాలు రావు. కానీ చదువుకున్న రెండు, మూడేళ్ల కాలంలోనే అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకుని రావాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే వెళ్లినప్పటికీ నుంచి అందరూ ఏదో ఓ పని చేస్తూనే ఉంటారు. హోమ్ సర్వీస్ నుంచి పెట్ సర్వీస్ వరకూ అన్నీ చేసి గంటల్లో యూరోలు సంపాదిస్తారు.
పార్టుటైమ్ జాబుల కోసం చదువు పేరుతో వెళ్తున్న యువత
అయితే ఇప్పుడు అలాంటి పనులు చేయడానికి కూడా యూకే ప్రభుత్వం అంగీకరించడం లేదు. అలాంటి వారు ఎక్కడ ఉన్న పట్టుకుని ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది తెలుగు యువత బ్రిటన్ కు వెళ్లారు. అక్కడ కొన్ని యూనివర్శిటీలను ఫీజుల కోసమే నడుపుతూంటారు. అక్కడ చేరి.. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందుకే స్టార్మర్ అందర్నీ డిపోర్టు చేసే నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ లో ఇల్లీగల్ గా ప్రవేశించే వారు తక్కువగానే ఉంటారు కానీ..ఇలా చదువుల కోసం వచ్చి ఇతర పనులు చేసుకునే భారత యువత ఎక్కువగానే ఉంటారు.
లక్షలు ఖర్చు పెట్టి ఫారిన్ వెళ్లాలంటే ఆలోచించాల్సిందే !
అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న చిన్న పనులు చేయడానికి మ్యాన్ పవర్ ఉండదు. అలాంటి అవసరాలను పార్టు టైమ్ జాబ్ ల పేరుతో చదువుకోవడానికి వెళ్లిన వారు చేస్తారు. ఒక్క భారత యువత మాత్రమే కాదు..ఆయా దేశాలకు వచ్చే ఇతర దేశాల వాళ్లు అందరూ చేస్తారు. ఇప్పుడు అలాంటి పనులు చేసేవారందర్నీ కట్టడి చేసి… ఆయా దేశాలకు పంపించి వేస్తే.. తమ దేశ ప్రజలకు కూడా ఆయా దేశాలు సమస్యలు తెచ్చినట్లవుతుంది. అయితే ఈ సమస్య కన్నా ముందు .. ఇప్పుడు డిపోర్టేషన్ అనేది ట్రెండ్ కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలని అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటున్నాయి. కెనడా ఇప్పటికే పని ప్రారంభించింది. యూకేతో పాటు ఇతర యూరప్ దేశాలు కూడా అదే పని చేసే అవకాశాలు ఉన్నాయి . అంటే భారత యువత ఫారిన్ కలలు..కల్లలు కాబోతున్నాయి.