బీహార్‌లో ఓ ప్లస్ టూ క్యాండిడేట్ ఎగ్జామ్ టాపర్…! ఆ టాపర్ సంచలనం సృష్టించారని మీడియా ఇంటర్యూలు తీసుకోవడానికి వెళ్లింది. ఆమె సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్…. దాని గురించి ఆమె చెప్పింది ఏమిటంటే.. అది వంటల శాస్త్రమట. దీంతో జర్నలిస్టులకు మైండ్ బ్లాంక్ అయింది. బీహార్ పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు… తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా.. అదే పంథాలో ఉంది. అయితే.. బీహార్‌లో అత్యధికంగా మార్కులు వేస్తే.. తెలంగాణలో మాత్రం తీసేశారు. మొదటి ఏడాది 90 మార్కులు తెచ్చుకున్న వారికి రెండో ఏడాది జీరో మార్కులు వేశారు. కొన్ని వేల మంది లబోదిబోమంటున్నా…. మేమంతా కరెక్టే అంటున్నారు అధికారులు. పాసవుతామన్న నమ్మకంతో ఉండి ఫెయిలయిపోయిన విద్యార్థులు.. ప్రాణాలు తీసుకుంటున్నారు.
తెలంగాణలో ఇప్పటికి పది మందికి పైగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో… ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు కూడా ఉన్నారు. ఒకరో ఇద్దరికో ఈ సమస్య వస్తే.. అది వారి సమస్య అనుకునేవారు. కానీ వేల మందికి వస్తే అది ఇంటర్ బోర్డు సమస్యే. ఇంటర్ మార్కుల్లో అవకతవకలు జరిగాయంటూ…పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులు హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. మార్కులు తారుమారయ్యాయని వారి ఆందోళన. ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్లే విద్యార్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్దకం చేశారంటూ ఇంటర్ బోర్డ్ ముందు కన్నీరు మున్నీరవుతున్నారు.
పరీక్షల్లో ఎప్పుడూ మంచి స్కోర్ సాధించే తమకు అతి తక్కువ మార్కులు రావడంతో పలువురు విద్యార్ధులు తీవ్ర మనోవేదనతో ఉన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అంటున్నారు. పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్‌గానే సాగిందన్నారు. ఏమైనా అనుమానాలుంటే రికౌంటింగ్కు వెళ్లండంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరీక్షల్లో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఎంసెట్ పేపర్ లీకేజీ కూడా అయింది. ఆ కేసు తేలలేదు. ఇప్పుడు… ఇంటర్ మార్కుల సంగతి కలకలం రేపుతోంది. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. విద్యామంత్రి లైట్ తీసుకున్నారు. తమ తప్పు లేకపోయినా.. తమ భవిష్యత్ ను గందరగోళంలోకి వెళ్లిపోవడంతో విద్యార్థులే ఆందోళన చెందుతున్నారు.