దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. రాష్ట్రాల సరిహద్దులు మూసేశారు. జిల్లాల సరిహద్దులూ మూసేశారు. ఇంకా చెప్పాలంటే… గ్రామాలు.. కాలనీలు కూడా తమ సరిహద్దుల్ని మూసేశాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు .. జనం ఇల్లు కదలకుండా చూసి.. లాక్ డౌన్ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. కానీ.. ప్రస్తుతం.. ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద వేల మంది ఉన్నారు. వారందరూ.. బోర్డర్ దాటడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. కొంత మంది వెనక్కి వెళ్లిపోతే.. మరికొంత మంది.. అవకాశం కోసం చూస్తున్నారు. ఐదుగురు గుమికూడవద్దని.. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెప్పిన ప్రభుత్వం వీరి సమస్యల్ని తీర్చడంలో మాత్రం ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోలేదు సరికదా.. అవే సమస్యలు తెచ్చి పెట్టాయి.
కృష్ణా, గుంటూరు సరిహద్దుల్లో వేల మంది..!
మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో.. సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకున్న హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వారు … అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రకాల కారణాలు చెప్పి పోలీసుల వద్ద అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులున్నారు. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్ అమీర్ పేట ప్రాంతంలో అలజడి రేగింది. హాస్టల్స్ మొత్తాన్ని ఖాళీ చేయించాలని అధికారులు యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఎవర్నీ బయటకు రాకుండా.. హాస్టల్స్‌లోనే ఉంచడానికి . లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయడానికి నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అవకాశం లేకుండా పోయింది. ఇన్ని తిప్పలు ఎందుకనుకున్నారేమో కానీ… విద్యార్థులందర్నీ.. వెళ్లిపోవాలని హాస్టల్ యాజమాన్యాలలు స్పష్టం చేశాయి. దాంతో.. వారందరూ.. పోలీసుల వద్దకు వెళ్లారు. హాస్టల్లో ఉండనీయరు… లాక్ డౌన్ కారణంగా బయటకు పోనీయరు..తామెక్కడికి పోవాలని.. ప్రశ్నించారు. దాంతో.. పోలీసులు అందరికీ… ఆంధ్రకు వెళ్లడానికి పర్మిషన్ లెటర్లు ఇచ్చారు. కనీసం సొంత ఇంటికి పోదామని అందరూ పోలోమని బయలుదేరారు. కానీ వారి ఆనందం.. బోర్డర్ దగ్గరకు వెళ్లే వరకే ఉంది.
వెళ్తే క్వారంటైన్లోకే… తేల్చేసిన ఏపీ అధికారులు..!
తమ సొంత రాష్ట్రంలోకి వెళ్లడానికి తమకు అడ్డంకులు ఎదురవుతాయని.. ఆ ఆంధ్రులు ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వీసా లాంటి పత్రం పోలీసుల వద్ద తీసుకొచ్చినా… ఏపీలోకి మాత్రం నో ఎంట్రీ బోర్డు పడింది . చెక్ పోస్టుల దగ్గర అందర్నీ… అడ్డుకున్నారు. ఎవర్నీ ఏపీలోకి అడుగుపెట్టనీయలేదు. మధ్యాహ్నం నుంచి.. తెల్లవారుజామున వరకు.. అక్కడ హైడ్రామా జరుగుతూనే ఉంది. గుంటూరు, కృష్ణా సరిహద్దుల్లో ఇదే పరిస్థితి. ఎంత ఆందోళన చెలరేగినా… వారి సమస్య పరిష్కారం కాలేదు. జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే వచ్చి ఏమీ చేయలేక వెళ్లిపోయారు. టీడీపీ నేతలు వచ్చి బిస్కెట్లు, మంచి నీళ్లు పంపిణీ చేశారు. అటు తెలంగాణ ఉండనీయక.. ఇటు.. ఏపీ రానివ్వకపోతే.. తాము ఎక్కడికి పోవాలని.. అక్కడున్న వారంతా.. మీడియా ముందు ఒక్క సారిగా ఫైర్ అయ్యారు. అదే సమయంలో.. అధికారులు.. ఏపీలోకి వచ్చే వారందరికీ ఓ ఆప్షన్ ఇచ్చారు. ఏపీకి రావాలంటే.. తప్పనిసరిగా పధ్నాలుగు రోజులు.. ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలని.. నూజీవీడు ట్రిపుల్ ఐటీలో ఉంచుతామని చెప్పారు. అదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం కూడా.. హాస్టల్స్‌ను మూసివేయవద్దని.. యాజమాన్యాలను ఆదేశించింది. నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని… దాంతో పాటు.. ప్రభుత్వం తరపున.. హాస్టల్స్ వద్ద.. ఉచిత అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే..అప్పటికే.. పోలీసుల అనుమతి పత్రాలు తీసుకుని వేల మంది ఏపీ బోర్డర్ కు వెళ్లిపోయారు.
ఆ వేల మందిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితేంటి..?
వివాదం పూర్తిగా ముదురుతున్న సమయంలో.. తెలంగాణ సర్కార్.. ఎవరూ సరిహద్దులు దాటవద్దని కోరుతూ.. ప్రకటన విడుదల చేసింది. డీజీపీ మహేందర్ రెడ్డి.. తెలంగాణ దాటి వెళ్లేందుకు.. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలు చెల్లవని ప్రకటించేశారు. స్వయంగా.. హైదరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి.. తాము బోర్డర్ దాటి వెళ్లడానికి పత్రాలు ఇస్తామని.. దాని కోసం స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని ఓ మెయిల్.. వాట్సాప్ నెంబర్ ఇచ్చి మరీ జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని డీజీపీ చెప్పేశారు. చివరికి ఎక్కువ మంది హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. . రెండు రాష్ట్రాలు అధికారులు చూపించిన టార్చర్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ సమస్యలు తలెత్తాయి. ఆ వేల మందిలో ఎవరికైనా కరోనా ఉంటే… లాక్ డౌన్ చేసిన ప్రయత్నం ఫెయిలయినట్లే..!