రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని గుర్తించడానికి నరం నుంచే రక్తాన్ని తీసి లేబొరేటరీలో విశ్లేషిస్తేనే ఖచ్చితమైన లెక్క తెలుస్తుంది. డయాబెటీస్ వున్నవారు ఉపయోగించే గ్లూకోమీటర్ లో కూడా గ్లూకోస్ లెవెల్స్ తెలుస్తాయి. అయితే లేబ్ లో విశ్లేషణకూ, శాంపిల్ స్టిక్ మీద వున్న రక్తాన్ని విశ్లేషించే గ్లూకోమీటర్ లెక్కకూ 10 నుంచి 15 శాతం తేడా వుంటుంది. ఈ తేడా గురించి మధుమేహవ్యాధి గ్రస్తులకు బాగా తెలుసు. తమ స్ధితిగతులను సుమారుగా తెలుసు కోడానికే వారు గ్లూకో మీటర్ వాడుతారు. ”ఇందులో కూడా స్టిక్ మీద రక్తం బొట్టు పడితే ఒక లెక్క , స్టిక్ కి రక్తం అంటుకుంటే మరొక లెక్క వస్తుంది. నిరాహారి గా వున్న వ్యక్తికి ఎట్టిపరిస్ధితుల్లోనూ గ్లూకోజ్ పెరిగే పసక్తే లేదు” అని తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ సెల్ చైర్మన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు డాక్టర్ సిఎల్ వెంకటరావు హైదరాబాద్ లో చెప్పారు.
నిరాహారదీక్షలో వున్నపుడు జగన్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం రెండోసారి గ్లూకోమీటర్ ద్వారా శాంపిల్ తీసుకోవడమే. వైద్యలోకానికి బాగా తెలిసిన ఈ చిన్న విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, స్వయంగా డాక్టర్ అయిన కామినేని శ్రీనివాస్ కి తెలియదా? తెలియకే జగన్ దీక్షను అనుమానిస్తూ వ్యాఖ్యలు చేశారా?? ఏమైనా ఈ వివాదంలో డాక్టర్ కామినేని ప్రతిష్ట మసకబారింది.” పదకొండేళ్ళు ఎంబిబిఎస్ చదివిన కామినేని శ్రీనివాస్ కూడా ఒక డాక్టరేనా? అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హేళన చేస్తున్నారు.
జగన్ తో సహా ప్రతీ ఒక్కరికీ ముందే తెలిసిన ప్రకారమే ఆయన ”ఆమరణ”నిరాహార దీక్ష భగ్నమైపోయింది. ఢిల్లీలో చేయవలసిన దీక్ష గుంటూరులో చేస్తే ప్రయోజనమేమిటని, చేసి మాత్రం ఏమి సాధించారు అనీ, జగన్ మీద విమర్శలు వున్నాయి. జగన్ దీక్షవల్లే ప్రత్యేక హోదా వచ్చేస్తూందని నమ్మే అమాయకులు ఎవరూ లేరు. అయితే హోదా పై ప్రజల్ని సెన్సిటైజ్ చేసిన ఒకే ఒక్క నాయకుడు జగన్. సిపిఐ, సిపిఎం పార్టీలు మాత్రమే కాక అనేక ప్రజా సంఘాలు, పౌరసంస్ధలు ప్రత్యేక హోదాపై జగన్ దీక్షకు మద్దతు ప్రకటించాయి. తీర్మానాలు చేశాయి.
ఏ రాజకీయ పార్టీతోనూ కలవని జగన్ మీడియా విషయంలో కూడా ఒంటెత్తుపోకడతోనే వుంటారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. తాను చేయాలనుకున్నదే చేస్తారు. తాను చెప్పాలనుకున్నదే చెబుతారు. ఆయన వ్యవహార శైలే అంత. అయితే ” ప్రత్యేక హోదా దీక్ష సందర్భంగా తటస్ధవాదుల నుంచి లభించిన మద్దతు ఊహించినదే అయినప్పటికీ విశేష పరిణామమని” ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరులో అన్నారు.
కొంత ఓటు బ్యాంకుతో ఐసొలేటెడ్ గా రాజకీయాలు నడిపే జగన్ పట్ల కొంత సానుకూల వాతావరణాన్ని తెచ్చిపెట్టడంలో 7 రోజుల నిరాహార దీక్ష దోహదపడింది. ”దీన్ని మరింత విశ్లేషించుకుని ముందుకి వెళ్ళగలిగితే మా బేస్ పెరుగుతుంది” అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంతా శ్రీహరి రాజమండ్రిలో చెప్పారు.
ఏమైనా రాజకీయ ఒంటరితనం నుంచి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో కాలు పెట్టడానికి ”హోదా దీక్ష” జగన్ కు బాట వేసింది. ఆయన ఆదారిలో నడుస్తారో లేదో కాలమే చెబుతుంది. జగన్ కంటే, ఆయన దీక్షపై అనుమానం కలిగేలా మాట్లాడిన మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు లకంటే ప్రజల దృష్టి, ఆలోచనలూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మీదే వున్నాయి. దీక్షద్వారా జగన్ తటస్ధుల్లో ఆసక్తి పెంచగలిగారు. అవివేకమైన వ్యాఖ్యానాల ద్వారా రాష్ట్రమంత్రులు సమర్ధించుకోలేని డిఫెన్సులో పడిపోయారు. “అసలు ఈయన డాక్టరేనా” అన్న వ్యాఖ్యకు మించిన హేళన కామినేని శ్రీనివాస్ కి మరొకటి వుండదు!