మారు వేషాల్లో వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను.. ఇతర ప్రాంతాలను తనిఖీ చేయడం సినిమాల్లో చాలా బాగుంటుంది. అలాంటి సీన్లు హైలెట్ అవుతాయి కూడా. ఏపీలో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లు అదే పని చేస్తున్నారు. రెండు రోజుల కిందట కృష్ణా జిల్లాసబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ ఇలాగే మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపులు నడిపే యజమానులకు షాకిచ్చాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు ఎరువులను విక్రయిస్తున్న వైనాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లుంగీ కట్టుకుని ఆయన చేసిన స్కిట్ కు మీడియాలో చాలా పబ్లిసిటీ వచ్చింది.
ఈ సారి చిత్తూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్ వేషం వేయకపోయినా సామాన్యురాలిగా వార్డు సచివాలయంలో ఆకస్మిక తనికీ చేశారు చిత్తూరులో 36వ వార్డు సచివాలయంలోకి వెళ్లారు. తనకు సొంత ఇల్లు లేదని దరఖాస్తు చేసుకుంటానని వారికి చెప్పారు. ప్రక్రియ గురించి వారు చెబుతూండగానే ఇతర ఉన్నతాధికారులు అక్కడకు వచ్చారు. డిప్యూటీ కలెక్టర్ పల్లవిని గుర్తు పట్టారు. దీంతో ఆమె తనిఖీలు మధ్యలోనే ఆగిపోయాయి. చిత్తూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్గా గృహ నిర్మాణ ప్రత్యేకాధికారి బాధ్యతలను పల్లవి నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఇటీవలి కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేయాలని.. ఆదేశిస్తూ వస్తున్నారు. అయితే పెద్దగా అధికారులు దృష్టి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు కొంత మంది యువ కలెక్టర్లు.. సామాన్యులుగా… మారు వేషాల్లోనూ వెళ్లి తమకు అప్పగించిన విషయాలపై తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయాలకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ప్రచారం లభిస్తోంది. దీంతో మరికొంత మంది డిప్యూటీ, సబ్ కలెక్టర్లు.. ఇలా తనిఖీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.