గ్రాండ్ లెవిల్ లో రీఎంట్రీ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. చిరు రీఎంట్రీ చిత్రం, ఆయన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించేసింది. ఈ సినిమాతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని నిరూపించుకున్నారు మెగాస్టార్. ఇప్పుడు ఆయన 151వ ప్రాజెక్టుకీ రంగం సిద్ధం అవుతోంది. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి తన కొత్త సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. అయితే గ్యాప్ లో ఆయనతో ఈ సినిమా చేయాలనుకునే నిర్మాతల లిస్టు క్రమంగా పెరిగిపోతుంది. ‘’డాడీ 151వ సినిమాని కూడా నేనే చేస్తా’ అంటున్నాడు రామ్ చరణ్. మరోవైపు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ కూడా యమా అర్జెంట్ గా చిరుతో సినిమా చేయాలని ఎప్పటినుండో భావిస్తున్నారు. క్రిష్ తో ఓ సినిమా అనుకుంటున్నారు చిరు. ఒకవేళ ఇది కుదిరితే క్రిష్ హోం బ్యానర్ లో సినిమా వుండే ఛాన్స్ వుంది. మరోవైపు అశ్వనీదత్ కూడా చర్చల్లో వున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనుకునే నిర్మాతల్లో మరో నిర్మాత చేరారు. ఆయనే కళాబంధు, సినియర్ నిర్మాత సుబ్బిరామి రెడ్డి.
మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు చిరంజీవిని ఘనంగా సత్కరించారు సుబ్బిరామి రెడ్డి.”మెగాస్టార్ చిత్రం తొలి వారంలోనే 108కోట్ల రూపాయిల వసూళ్ళు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందని, ఇది కేవలం మెగాస్టార్ వలనే సాధ్యమైయిందని” చెప్పుకొచ్చారు సుబ్బిరామి రెడ్డి . ఇదే సందర్భంలో పనిలో పనిగా మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్నానని కూడా ప్రకటించారాయన. అప్పట్లో మెగాస్టార్ తో ‘స్టేట్ రౌడీ’ సినిమా నిర్మించా. అది తెలుగులోనే కాదు హిందీలోనూ డబ్ అయి ఘన విజయం సాధించింది. చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన్ని మళ్ళీ నటనలోకి వెళ్ళమని కోరేవాడిని. ఇప్పుడు ఆయన రీఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే నా నిర్మాణంలో ఓ భారీ సినిమా నిర్మిస్తా. ఇందులో చిరంజీవి గారితో పాటు పవన్ కళ్యాణ్ , చరణ్ , అల్లు అర్జున్ వుంటారు. ఇదో మెగా మల్టీస్టారర్ అవుతుంది’’ అని సభా ముఖంగా ప్రకటించారు సుబ్బిరామి రెడ్డి.
మొత్తానికి చిరంజీవితో ఓ సినిమా నిర్మించాలనే కోరికను బయటపెట్టారు సుబ్బిరామి రెడ్డి. ఆయన చెప్పారంటే సినిమా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మెగాస్టార్ 151,152 చిత్రాలకు ఆల్రెడీ నిర్మాతలు కుదిరిపోయారు. 153వ సినిమా ఛాన్స్ దక్కే అవకాశం అయితే వుంది. అయితే సుబ్బిరామి రెడ్డి ఇందులో పవన్ కూడా అంటున్నారు. మరి ఇందులోకి పవన్ ని తీసుకురావడం కుదురుందా? సాధ్యమయ్యే కలయికేనా అన్నది ప్రశ్నార్ధకం.