కొన్ని రోజుల క్రితమే రాజ్యసభ సభ్యుడుగా నియమింపబడిన భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామిని ‘భారత్ ట్రంప్’ అనవచ్చు. డోనాల్డ్ ట్రంప్ లాగే ఆయన నోటికి కూడా అందరూ అలుసే. రాజ్యసభలో ప్రవేశించగానే సోనియా,రాహుల్ గాంధీలు లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించిన స్వామి, ఇవ్వాళ్ళ ఆర్.బి.ఐ. గవర్నర్ రఘురామ్ రాజన్ పై నోరు పారేసుకొన్నారు.
ఆయన ఆ పదవికి పనికిరారు కనుక తక్షణమే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. ఎందుకంటే దేశంలో ద్రవ్యోల్భణం అదుపులో ఉంచడానికి ఆయన వడ్డీ రేట్లు పెంచేసారని, ఆ కారణంగా దేశంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, దానితో అనేకమంది నిరుద్యోగులుగా మారారని స్వామి చెప్పారు. “గవర్నర్ రాజన్ తీసుకొన్న తప్పుడు నిర్ణయాలు దేశానికి చాలా నష్టం కలిగించాయి కనుక ఆయన ఆ పదవికి అనర్హుడని నేను భావిస్తున్నాను. ఆయనను వీలయినంత త్వరగా అ పదవి నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను,” అని స్వామి మీడియాతో అన్నారు.
దేశ ఆర్ధిక వ్యవస్థలో ఆర్.బి.ఐ. గవర్నర్ పాత్ర చాలా కీలకమైనది. ఒకవిధంగా ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు ప్రతినిధి వంటివారని చెప్పవచ్చు. ఆర్ధిక శాఖ విదివిదానాలు, కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఆయన పనిచేస్తుంటారు కనుక ఆయనను తప్పు పట్టడం అంటే ఆయనని గవర్నర్ గా ఎంచుకొన్న కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంగానే భావించవలసి ఉంటుంది. కనుక దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
రాజన్ తీసుకొన్న నిర్ణయాల వలన జరిగే నష్టం కంటే ఆయనపై స్వామి చేసిన వ్యాఖ్యల వలెనే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ‘ఒక దేశ ఆర్ధిక వ్యవస్థకి మార్గదర్శనం చేస్తున్న వ్యక్తి ఆ పదవికి అనర్హుడు..అతని నిర్ణయాలన్నీ తప్పులు తడకలు’ అని అధికార పార్టీకి చెందిన ఎంపియే లోకానికి చాటి చెపుతుంటే అది మార్కెట్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ప్రతిపక్షాలు కూడా మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శలు గుప్పించవచ్చు. స్వామి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు ప్రపంచ దేశాలని కూడా ఆకర్షిస్తాయి. కనుక అంతర్జాతీయంగా కూడా భారత్ పై దురాభిప్రాయం కలిగించే ప్రమాదం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏరికోరి స్వామిని రాజ్యసభకు తీసుకువస్తే, ఇప్పుడు ఆయన నోటి దురద కారణంగానే సమస్యలు ఎదుర్కోవలసివస్తోంది. మరి ఈ స్వామిని ఏవిధంగా అదుపులో ఉంచుతారో చూడాలి.