తన కుటుంబసభ్యులపై.. దాదాపుగా ప్రతీ రోజూ నమోదు చేస్తున్న కేసుల్లో.. ఒక్క దానిపైనైనా .. కనీస ఆధారం చూపించాలని.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. ఒక్క ఆధారం చూపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటానన్నారు. గత మూడు రోజులుగా ఆయన కుమారుడు, కుమార్తెపై నమోదవుతున్న కేసుల నేపధ్యంలో.. వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చారు. అసలేం జరుగుతుందో చెప్పడం తన బాధ్యతన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని.. అధికారంలో ఉన్నప్పుడు.. దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేధిస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
విజయసాయిరెడ్డి… రెచ్చగొట్టి.. తమ కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయిస్తున్నారని.. కోడెల ఆరోపిస్తున్నారు. ఒకే రోజు.. తన కుమారుడు, కుమార్తెపై.. కేసులు నమోదు చేసిన తర్వాత.. విజయసాయిరెడ్డి.. కోడెల కుటుంబంపై కేసులు పెట్టాలని.. ట్విట్టర్లో పిలుపునిచ్చారని కోడెల గుర్తు చేశారు. కేవలం.. వేధింపుల కోసమే.. కేసులు పెడుతున్నారని.. దీని ద్వారా స్పష్టమవుతుందన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. తన కుమారుడు.. శివరాం మంచి వ్యాపారవేత్త అని కితాబిచ్చారు. ఆయన కంపెనీల ద్వారా 450 మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. ఆ కంపెనీలకు ప్రభుత్వం వద్ద నుంచి దాదాపుగా రూ. వెయ్యి కోట్ల వరకూ.. రావాల్సి ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. ఇతర పార్టీల నేతలపై దాడులు చేయడం.. అక్రమంగా కేసులు పెట్టడం జరగలేదని.. కోడెల గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. దాడులు, కేసులతో… ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. స్పీకర్గా తన విధులను.. అత్యున్నత ప్రమాణాలతో..నిర్వహించానన్నారు. కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపైనా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికి కోడెల కుటుంబంపై.. ఎడెనిమిది కేసులు నమోదయ్యాయి.