భాజపా రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మేధావే..అందులో సందేహం లేదు. కానీ అయన ఆషామాషీ మేధావి కాదు. విద్వంసకరమైన మేధావి. ఆయనని మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో పోల్చవచ్చు. రాజకీయ ఎత్తులు వేయడంలో, మాతకారితనంలో లాలూని మించినవారు లేరని అందరికీ తెలుసు. కానీ ఆయన తెలివితేటలు బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. సుబ్రహ్మణ్య స్వామి కూడా అంతే! ఆయన తన మేధసుతో దేశంలో ఏ క్లిష్ట సమస్య పరిష్కరించడానికి వినియోగించరు. ఎవరో ఒకరిపై బురద జల్లడానికో లేక కోర్టులకీడ్వడానికో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఆవిధంగా అవినీతిపరుల భరతం పడుతున్నానని ఆయన సమర్ధించుకోవచ్చు. కానీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతదాస్, కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీలపై బురదజల్లడం దేనికి? అంటే సరైన సమాధానం ఉండదు. ‘ఆయన చేస్తున్న పని తప్పు. ప్రచార యావతో వ్యవస్థలో వ్యక్తులపై విమర్శలు చేయడం తగదు,’ అని సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారంటే సుబ్రహ్మణ్య స్వామి మేధసు దేనికి ఉపయోగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడీ చిన్న హెచ్చరికతో సుబ్రహ్మణ్య స్వామి నోరు కుట్టేశారనే చెప్పవచ్చు. కానీ అపనేదో ముందే చేసి ఉండి ఉంటే ఆయన నోటికి ఇంతమంది బలైపోయేవారు కాదు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హెచ్చరికతో సుబ్రహ్మణ్య స్వామి కొంచెం నోటిని అదుపు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పూర్తిగా నోరు కట్టేసుకొని బ్రతకడం తనవలన కాదని తాజా ట్వీట్ మెసేజ్ తో స్పష్టం చేశారు. “రామమందిరం, జాతీయ హైవేల నిర్మాణం, స్వామి దేవానంద కేసులో చేరడం, ఎయిర్ సెల్ మాక్సిస్, చెన్నై సూపర్ కింగ్స్ పై నిషేధం వంటి అనేక సమస్యలపై నేను దృష్టి సారించవలసి ఉంది. కనుక ఇకపై వారానికి కొంచెం తక్కువ ట్వీట్లు మాత్రమే పెడుతుంటాను,” అని మెసేజ్ పెట్టారు.
ఆయన పెట్టిన మెసేజ్ చూస్తే, దేశంలో అన్ని సమస్యల గురించి మాట్లాడవలసిన బాధ్యత తనపైనే ఉందని ఆయన భావిస్తున్నట్లున్నారు. అది ‘నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదు’ అన్నట్లుంది.