రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు “సుబ్రహ్మణ్య”. ఇదొక సోషియో ఫాంటసీ అడ్వెంచర్.
తాజాగా బయటికి వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని అర్ధమౌతోంది. ప్రేక్షకులని థియేటర్స్ కి ఆకర్షించే కంటెంట్ ఇందులో కనిపించింది. ఓ పురాతన బావి, చుట్టూ విషసర్పాలు కాపలగా వున్న ఓ పవిత్ర గ్రంధం, దాన్ని దొంగలించడానికి వచ్చే కథానాయకుడు, వెంబడించిన సర్పాలు, భారీ వానరాలు… ఇలా విజువల్ ట్రీట్ గా గ్లింప్స్ ని తీర్చిదిద్దారు. చివరిగా శ్రీరాముడు ఎంట్రీ… అదిరిపోయిందనే చెప్పాలి. దానికి తోడు రవి బస్రూర్ ఇచ్చిన నేపథ్య సంగీతం విజువల్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అద్వాయ్ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది.
లావిష్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రీమియం లార్జ్ ఫార్మాట్ లో ఈ సినిమాని షూట్ చేస్తున్నారట. ఈ ఏడాదిలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవుడు, భక్తి, ధ్రిల్లింగ్ అంశాల్ని మేళవించి తీస్తున్న సినిమాలు ఈమధ్య బాగా ఆడుతున్నాయి. వాటికి పాన్ ఇండియా మైలేజీ కూడా ఉంటోంది.త మరి సుబ్రహ్మణ్య ఏం చేస్తాడో చూడాలి.