వైసీపీ నేతలు తనను వాడుకోవచ్చు కానీ.. దానికి ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనని సుబ్రహ్మణ్య స్వామి పట్టుబడుతున్నారు. తాజాగా తన కోరికను ఢిల్లీలో బయట పెట్టారు. వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి పార్లమెంట్ కు రావాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన జగన్ రెడ్డికి మద్దతుగా చాలాకాలంగా మాట్లాడుతున్నారు. గత ఏడాది ఆయన రాజ్యసభ సభ్యత్వం పూర్తయినప్పుడు ఆయనకు రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ..కానీ ఎందుకో ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఇవ్వాలన్నట్లుగా ఆయన తీరు ఉంది.
ఆంధ్రజ్యోతి ఓనర్ పై పరువు నష్టం కేసులు వేస్తానని.. ఆయనను ఇబ్బంది పెడతానని… జగన్ రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామి హామీ ఇచ్చారు. తిరుపతి కోర్టుకు చాలా సార్లు వచ్చారు. కానీ ఏమీ చేయలేకపోయారు. అసలు ఆయన లాయర్ కానే కాదనే విషయం చాలా మందికి తెలియదు. కానీ… కోర్టుల్లో లిటిగేషన్ పిటిషన్లు వేసి.. కొంత మందిని ఇబ్బందిపెట్టడంతో ఆయన లాయర్ అనుకుంటూ ఉంటారు. జగన్ రెడ్డి కూడా అలా అనుకున్నారేమో కానీ…. ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. కానీ జగన్ రెడ్డిని మాత్రం పొగుడుతున్నారు.
టీటీడీపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన సమాధానం చెబుతున్నారు. శ్రీవారి ట్రస్ట్ గొప్పదంటున్నారు. ఎవరూ ఆరోపణలు చేయవద్దంటున్నారు. చంద్రబాబు రాజకీయాలు చేసుకోవాలి కానీ టీటీడీ జోలికి రావొద్దంటున్నారు. మొత్తంగా రాజ్యసభ సీటు ఆశ చూపి.. సుబ్రహ్మణ్యం స్వామిని ఉపయోగించుకోవాలనుకున్న జగన్ రెడ్డికి ఆయన గుదిబండగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల తరవాత రాజ్యసభ సీటివ్వలేని పరిస్థితి వస్తే… ఆయన జగన్ రెడ్డిపై దారుణంగా విరుచుకుపడే చాన్స్ ఉంది. బీజేపీ నుంచి తన రాజ్యసభ సీటును రెన్యూవల్ చేయలేదని గతంలో ఆయన మోదీ, షాలను కూడా వదల్లేదు.