కోర్టుల్లో పిటిషన్లు వేసి రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యస్వామిని భారతీయ జనతా పార్టీ దూరం పెట్టేసింది. ఇప్పటి వరకూ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఆయనకు ఈ సారి ఆ పదవి లేకుండా చేసింది. వచ్చే మార్చికి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసిపోతుంది. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనను పట్టించుకోవడం మానేశారు. మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం కూడా లేదు.
ఈ విషయంపై ఆయనకు అవగాహన ఉండటంతో వైసీపీ అధినేత జగన్ తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కోర్టుల్లో పిటిషన్లు వేయడం ద్వారా రాజకీయ లక్ష్యాలు సాధించి పెట్టేందుకు ఆయన ఉపయోగపడతారని జగన్ భావిస్తున్నారన్న అభిప్రాయం ఇటీవల పరిణామాల ద్వారా కలుగుతోంది. ప్రత్యేక విమానాల్లో సుబ్రహ్మణ్య స్వామికి ఏపీకి వచ్చి వెళ్తున్నారు. జగన్తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు జగన్ అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది.
అలా ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటాలోనే ఇస్తారు. గతంలో రిలయన్స్ కు ఓ రాజ్యసభ సీటు కేటాయించినప్పుడు వైసీపీ కోటాలోనే ఇచ్చారు. ఇప్పుడు వచ్చే మార్చిలో వైసీపీ తరపునే సుబ్రహ్మణ్య స్వామి రాజ్యసభ సభ్యుడయినా ఆశ్చర్యం లేదంటున్నారు. విజయసాయిరెడ్డికి కోత పెట్టి ఆ సీటును ఆయనకు ఇస్తారన్న భావిస్తున్నారు.