హైదరాబాద్: వివాదాస్పద నేత సుబ్రమణ్యన్ స్వామి సొంతపార్టీ బీజేపీకే అడ్డం తిరిగారు. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ కీర్తి ఆజాద్‌పై సస్పెన్షన్ వేటు వేయటం సరికాదని కుండ బద్దలు కొట్టారు. ఆజాద్‌కు తాను మద్దతిస్తానని చెప్పారు. ఆజాద్ లాంటి నిజాయతీపరుడిని పార్టీ కోల్పోకూడదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆజాద్ చిన్నప్పటినుంచి తనకు తెలుసని, అతని తండ్రి తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అతను ఇంకా బీజేపీ సభ్యుడేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు తనపై సస్పెన్షన్ వేటు వేయటంపై ఆజాద్ స్పందిస్తూ, పార్టీ నోటీస్ అందుకున్నానని, దానికి సమాధానం చెబుతానని అన్నారు. డీడీసీఏలో అవినీతిని ప్రశ్నించినందుకే తనను సస్పెండ్ చేశారా అని తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. బీసీసీఐలో జరిగిన అనేక అక్రమాలపై కూడా తాను ప్రశ్నించానని అన్నారు. తాను ఎంపీనని, తాను కొన్ని ప్రశ్నలు లేవనెత్తానని, దానికి గానూ తనను సస్పెండ్ చేశారని చెప్పారు. అయితే డీడీసీఏ అంశాన్ని 3 నెలల్లో పరిష్కరించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ విషయాన్ని పరిశీలించి తన తప్పేమిటో చెప్పాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. వివరంగా సమాధానాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. నిజం మాట్లాడటమే నేరమైతే, తాను నేరాలు చేస్తూనే ఉంటానని అన్నారు. బీజేపీ మార్గదర్శక్ మండల్ కూడా ఈ విషయాన్ని పరిశీలించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడి అంటే తనకెంతో గౌరవం ఉందని అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పుకుంటూ వస్తున్న బీజేపీ అసలు రంగు ఇప్పుడు బయటపడటం తనకు ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.