పార్లమెంటు లోపలా బయటా మోడీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు సుబ్రహ్మణ్య స్వామికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి డిల్లీకి తీసుకువస్తే, ఇప్పుడు ఆయన మోడీ ప్రభుత్వాన్నే అల్లరిపెడుతూ మోడీకి కూడా పెద్ద తలనొప్పిగా మారారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ పై ఆయన తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నప్పుడు, మోడీతో సహా అందరూ ప్రేక్షకులాగ చూస్తూ ఊరుకొన్నారు. ఎందుకంటే రాజన్ తమ ప్రభుత్వంపై కొన్నిసార్లు విమర్శలు చేశారు. మళ్ళీ రెండవసారి తన పదవిలో కొనసాగనని రాజన్ స్పష్టం చేసిన తరువాత స్వామి తన తుపాకీని అరవింద్ సుబ్రహ్మణియన్ స్వామి,శక్తికాంత దాస్ పై గురిపెట్టారు.
ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, అయన బృందంపైనే గురిపెట్టారు. చైనా పర్యటనలో వారు సూట్లు, టైలు కట్టుకొని హోటల్లో వెయిటర్లలాగ కనిపిస్తున్నారని విమర్శించారు. విదేశాలకి వెళ్ళే మంత్రులు, అధికారులని భారతీయ పద్దతిలో దుస్తులు ధరించాలని ఆదేశించవలసిందిగా స్వామి ప్రభుత్వానికి ట్వీటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై అటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు భాజపాలో చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అరవింద్ సుబ్రహ్మణియన్ స్వామి,శక్తికాంత దాస్ లపై సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు మొదలుపెట్టినప్పుడే ఆయన తన హద్దులు దాటుతున్నారని భాజపాలో చాలా మంది అభిప్రాయపడ్డారు. స్వామిని సంయమనం పాటించవలసిందిగా భాజపా నేతలు కోరారు. కానీ ఆయనిచ్చిన జవాబుతో వారు షాక్ అయ్యారు. “కొంతమంది నన్ను సంయమనం పాటించమని కోరుతున్నారు కానీ నేను మౌనం వహిస్తే రక్తపాతం జరుగుతుంది,” అని జవాబిచ్చారు.
ప్రభుత్వాన్ని విమర్శించవద్దంటే రక్తపాతం జరుగుతుందని స్వామి హెచ్చరించడం చాలా అనూహ్యంగా ఉంది. ఆయన ఆవిధంగా ఎందుకు అన్నారో? తెలియదు. ఆయనకి సంఘ్ పరివార్ మద్దతు ఉందని అందరికీ తెలుసు. ఆ ధైర్యంతోనే ఆయన మోడీ ప్రభుత్వంతో చెలగాటం ఆడుతున్నారా? అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనని కట్టడి చేయలేకపోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనని చెన్నై నుంచి డిల్లీకి తెచ్చి నెత్తిన పెట్టుకోవడం మోడీ ప్రభుత్వానికి కొరివితో తల గోక్కొన్నట్లవుతోంది.