‘పందెం కోడి’ తరవాత తెలుగులో విశాల్‌కి యంగ్ స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఏర్పడింది. అప్పట్లో వచ్చిన ‘భరణి’, ‘పొగరు’ తదితర సినిమాలు బాగా ఆడాయి. అక్కణ్ణుంచి మెల్ల మెల్లగా విశాల్ మార్కెట్ తగ్గింది. మళ్ళీ ‘అభిమన్యుడు’తో విశాల్‌కి మంచి హిట్ లభించింది. చాలా రోజుల తరవాత అతడికి తెలుగులో దక్కిన విజయమిది. దాంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ నిర్మాత హరి ఫుల్ హ్యాపీగా వున్నారు. ఈ మధ్య విశాల్ సినిమాలు అన్నిటినీ ఈయనే తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్మాత హరి “సినిమాని 600 థియేటర్లలో విడుదల చేశాం. మరో 60 థియేటర్లు ఈ రోజు పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం వుంది. విశాల్ లాస్ట్ సినిమాలు తెలుగులో సరిగా ఆడలేదు. ‘డిటెక్టివ్’ మంచి సినిమా అయినప్పటికీ… ఎందుకో ఆదరణ దక్కలేదు. కమర్షియల్ విజయాలు సాధించలేదు. దాంతో ఈ విజయం మాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని విశాఖ, రాజమండ్రి, కాకినాడలలో సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు. ‘అభిమన్యుడు’తో పాటు శుక్రవారం విడుదలైన ‘ఆఫీసర్’, ‘రాజుగాడు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో విశాల్ సినిమాకి మరింత ఆదరణ లభిస్తోంది. విశాల్‌కి తోడు యాక్షన్ కింగ్ అర్జున్, సమంత సినిమాకి ప్లస్ అయ్యారు.