దిశ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇరవై రోజుల్లో విచారణ పూర్తి ముగ్గురికి ఉరిశిక్ష వేసేశారట. ఇరవై మందికి జీవిత ఖైదు కూడ విధించారట…!. ఏమిటేమిటి..అని ఆశ్చర్యపోకండి.. ఇదేదో.. సాదాసీదా వ్యక్తులు చెప్పింది కూడా కాదు. స్వయంగా హోంమంత్రి సుచరిత ఇచ్చిన స్టేట్మెంట్. గుంటూరులో ప్రేమ వేధింపులకు బలైన ఓ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి దిశ చట్టాన్ని తాము ఎలా ఆడబిడ్డల రక్షణకు ఉపయోగిస్తున్నామో చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో ముగ్గురికి ఉరి.. ఇరవై మందికి జీవితఖైదు పడిందనే “నిజాన్ని” కూడా వెల్లడించారు.
హోంమంత్రి సుచరిత వ్యాఖ్యలు విని .., పక్కన ఉన్న వాళ్లు ఉలిక్కిపడ్డారు. కానీ ఆమె మాత్రం.. అనర్ఘళంగా దిశ చట్టం ఏపీలో ఎంత గొప్పగా అమలవుతోందో చెప్పుకొచ్చారు. దిశ చట్టాన్ని కేంద్రం వెనక్కి పంపింది. రెండు, మూడు సార్లు పంపినా.. మళ్లీ అనేక అభ్యంతరాలు చెబుతూ వెనక్కిపంపడంతో.. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో వెనక్కి తీసుకున్నారు. మళ్లీ వేరే బిల్లు పెట్టారు.. కానీ అందులో చట్టం అనే ప్రస్తావన లేదు. కేవలం నిర్భయ, పోక్సో చట్టాలను అన్వయించి .. ప్రత్యేక కోర్టులు పెట్టి విచారణ చేస్తామని మాత్రమే అందులో ఉంది. దీంతో దిశ చట్టం అనేది అసలు లేదు.. ఇక రాదు అని తేలిపోయింది. అయితే ఘనత వహించిన హోంమంత్రికి ఆ విషయం తెలియదో.. తెలిసినా ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారో కానీ.. అది అమల్లో ఉందని.. శిక్షలు వేసేస్తున్నామని చెబుతున్నారు.
దిశ చట్టం విషయంలో ఏపీ సర్కార్ ది మొదటినుంచి ప్రచార ఆర్భాటమే. ముందు వెనుకలు చూసుకోకుండా… చట్టం చేసేశారు. రాజ్యాంగ నిబంధనలు… శిక్షా సెక్షన్లు ఇలాంటివన్నీ మార్చేస్తూ బిల్లు తెచ్చారు. అదెలా సాధ్యమని కామన్సెన్స్ఉన్న వాళ్లు ప్రశ్నించినా పట్టించుకోలేదు. బిల్లు కేంద్రం ఆమోదం పొందకుండానే.. పోలీస్ స్టేషన్లకు.. కొత్త రంగులు వేసి దిశ పోలీస్ స్టేషన్లుగా మార్చారు. చివరికి బిల్లును ఉపసంహరించుకున్న తర్వాత పాత స్కూటర్లకు వైసీపీ రంగులు వేసి.. దిశ పోలీస్ స్టేషన్లకు ఇచ్చారు. ఇలాంటి విన్యాసాలు ఇంకా ఇంకా కొనసాగుతున్నాయి. కానీ దిశ చట్టం అనేది లేదన్న విషయాన్ని మాత్రం.. గోప్యంగా ఉంచి.. ప్రచారం చేయడానికి హోంమంత్రి కూడా వెనుకాడటంలేదు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అబద్దాలు చెబితే ఏం వస్తుందో బాధ్యతల్లో ఉన్న వారికే తెలియాలి.