ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాకర్ విజయవాడ ఐటీ కమిషనర్‌గా వచ్చారు. ఆ విషయం తెలుసు. ఇప్పుడు వెళ్లారు కూడా. ఆయన ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెళ్లిపోయారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ కమిషనర్ తమ వాడైతే ఇక ఎదురు ఉండదని వైసీపీ నేతలు అనుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న సమయంలో అభినందించడానికి పోటీ పడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. వారానికే ఆయనను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన రిలీవ్ కావాల్సి వచ్చింది.
ఐఆర్ఎస్ అధికారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ అదీ కూడా తన భార్య హోంమంత్రిగా రాజకీయాల్లో ఉన్న రాష్ట్రంలోనే పోస్టింగ్ అంటే మామూలు విషయం కాదు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిన సమయలో ఇటు ఐటీ.. అటు అధికారం రెండు చేతుల్లో ఉంటే ఏదైనా చేయవచ్చు. ఆ అవకాశం వైసీపీకి దక్కిందని అనుకున్నారు. అయితే ఏం జరిగిందో కానీ హఠాత్తుగా ఆయనను దరిదాపుల్లో కూడా లేకుండా బదిలీ చేశారు. ఆయన నియామకం జరిగినప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ కారణంగా బదిలీ చేసి ఉంటారని భావిస్తున్నారు.
అయితే పోస్టింగ్ కోసం ఎంతో లాబీయింగ్ చేసుకుని ఉంటారని ఇలా ఓ రెబల్ ఎంపీ ఫిర్యాదు చేస్తేనే బదిలీ చేసేస్తారా అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ఆయన ఏపీకి రావడం వైసీపీలోనే ఓ ముఖ్య నేతకు ఇష్టం లేదని.. అందుకే ఆయనను తక్షణం బదిలీ చేయించేశారని కొంత మంది నమ్ముతున్నారు. కారణం ఏదైనా కానీ విజయవాడ వైసీపీ నాయకులకు దండల ఖర్చు దండగ అయింది. ఆయన వారానికే వెళ్లిపోయారు.