ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ రణ రంగం రసవత్తరంగా మారుతోంది. నువ్వా నేనా అనేలా రాజకీయ పార్టీలు వారి గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారు. టీడీపీ విషయానికి రాజకీయంగా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, వ్యూహాలతో ముందుకు వెళ్లి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈసారి అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. గెలుపు గుర్రాలను ఎంచుకోవాలనే తపనతో ఆయన ముందుకు సాగుతున్నారు. రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌తో ముందుకు రావాలని ఆలోచిస్తున్నారు. అందుకు తగినట్లే అడుగులు వేస్తున్నారు. వైసీపీ పార్టీకి సరైన పోటీనివ్వాలని భావిస్తోన్న టీడీపీ నాయకత్వం యువ పారిశ్రామిక వేత్తలను ఈసారి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి ప్లానింగ్‌ను గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు అనుసరించారు. అది విజయం వైపు అడుగులు వేసేలా చేసింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు సైతం అదే విధానాన్ని పాటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ అధినేత ఓ యువ పారిశ్రామిక వేత్తను రంగంలోకి దించటానికి సిద్ధమయ్యారు. ఈ యువ పారిశ్రామిక వేత్తకు ఆర్థికబలమే కాదు.. సామాజిక స్పృహ ఉండటం విశేషం. ఆయనెవరో కాదు.. కంచర్ల సుధాకర్. యువకుడే కాదు, విద్యావంతుడు, హెల్త్ కేర్ రంగంలో పలు ఐటీ సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన కంచర్ల సుధాకర్ అయితే ప్రజల్లో చొచ్చుకుని వెళతారనేది అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ఈయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించటానికి టీడీపీ యువనేత నారా లోకేష్ ఆలోచించటమే కాదు.. ఆయనతో టచ్‌లో ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏలూరు, గుంటూరు, నర్సారావు పేట, రాజమండ్రిలలో ఎక్కడి నుంచి పోటీలోకి తీసుకు రావాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై అవగాహన ఉండటంతో పాటు సామాజిక స్పృహ, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండటంతో కంచర్ల సుధాకర్ సైతం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కందుకూరు గ్రామానికి చెందిన సుధాకర్‌కి హెల్త్ కేర్ రంగంలో మంచి అనుభవం ఉంది. ఇప్పుడు ఆయన్ని ఏ నియోజక వర్గం నుంచి రంగంలోకి దించుతారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.