విశాఖ మానసిక ఆస్పత్రిలో తనను నిజంగానే పిచ్చోడిని చేసే మందులు వేస్తున్నారని భయపడుతున్న నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్.. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాసిన సుధాకర్ స్పందన లేకపోయే సరికి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ సుధాకర్ పిటిషన్లో వివరించారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేలా.. అనుమతి ఇవ్వాలని కోరారు. సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
సుధాకర్ .. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు స్వహస్తాలతో లేఖ రాసిన రోజున ఆమె తల్లి ప్రెస్‌మీట్ పెట్టి… ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్నారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే.. సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై.. దర్యాప్తు చేయాలని.. హైకోర్టు… సీబీఐని ఆదేశించింది. ప్రస్తుతం.. విశాఖపట్నంలోని సీబీఐ అధికారులు పని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. సుధాకర్ విషయంలో పోలీసులు అంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు.. మానసిక రోగిగా ముద్ర వేయడానికి దారి తీసిన పరిస్థితుల్ని.. సీబీఐ అధికారులు పరిశీలన జరిపే అవకాశం ఉందంటున్నారు.
సాధారణంగా మానసిక రోగి అని నిర్ధారించడానికి చాలా పరీక్షలు ఉంటాయి. ఎలాంటి పరీక్షలు చేశారు..? ఎవరు నిర్ధారించారనేది బయటపడితే సుధాకర్ వ్యవహారంలో కుట్ర ఉందో లేదో తేలుతుందనే అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో ఉంది. సుధాకర్ పిటిషన్‌ను హైకోర్టు నేడో రేపో విచారించే అవకాశం ఉంది.